నెలరోజుల్లో ఏడింతలు పెరిగిన వరి నాట్లు | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో ఏడింతలు పెరిగిన వరి నాట్లు

Published Sun, Feb 5 2017 2:55 AM

నెలరోజుల్లో ఏడింతలు పెరిగిన వరి నాట్లు - Sakshi

సరిగ్గా నెల క్రితం 15 శాతమే... ఇప్పుడు 103 శాతం
గతం కంటే రెండింతలు పెరిగిన ఆహార ధాన్యాల సాగు
తెలంగాణ వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడి
37 శాతానికే పరిమితమైన ఉల్లిగడ్డ సాగు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రికార్డు స్థాయి లో రబీ వరి నాట్లు పడ్డాయి. సాధారణ వరి సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఏకంగా 103 శాతం ఉండటం గమనార్హం. గత రబీతో పోలిస్తే మూడింతలకు మించి నాట్లు పడ్డాయని తెలం గాణ వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సరిగ్గా నెల క్రితం అంటే జనవరి నాలుగో తేదీన వరి నాట్లు 2 లక్షల (15%) ఎకరాల్లోనే పడ్డాయి. నెల తిరిగే సరికి ఏకంగా 13.70 లక్షల ఎకరాల్లో (103%) నాట్లు పడడం గమనార్హం.

గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వర్షాలతో వాగులు వంకలు, చెరువులు నిండాయి. భూగర్భ జలాలు పెరిగాయి. దీం తో ఈసారి రబీ పంటల సాగు అత్యంత ఆశా జనకంగా ఉందని వ్యవసాయశాఖ వెల్లడిం చింది. రబీలో అన్ని రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.20 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 25.01 లక్షల (94%) ఎకరాల్లో సాగు చేశారు. నెల క్రితం కేవలం 46 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. పంటల సాగులో కీలకమైన ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 21.90 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 22.57 లక్షల (103%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

ఆహార ధాన్యాల్లో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 13.70 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. గత రబీలో ఇదే సమయానికి కేవలం 4.07 లక్షల ఎకరాలకే వరి నాట్లు పరిమితం కావడం గమనార్హం. పప్పుధాన్యాల సాగు కూడా సాధారణం కంటే 143 శాతం ఉండటం గమనార్హం. రబీలో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.17 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 4.52 లక్షల (143%) ఎకరాలు సాగుకావడం విశేషం.

ఇదిలావుంటే నూనె గింజల సాగులో కీలకమైన వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.80 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 3.62 లక్షల (95%) ఎకరాలు సాగైంది. అయితే ఉల్లిగడ్డ సాగు మాత్రం గణనీయంగా పడిపోయింది. రబీలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలు కాగా... ఇప్పటివరకు కేవలం 10 వేల (37%) ఎకరాలకే పరిమితమైంది. ఉల్లి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం సాగు విస్తీర్ణం పెరగలేదు.

నిరాశపరిచిన ఈశాన్య రుతుపవనాలు...
ఖరీఫ్‌ చివరి దశ సెప్టెంబర్‌లో రాష్ట్రంలో 180 శాతం అధికంగా వర్షపాతం కురవగా... ఆ తర్వాత ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి. అక్టోబర్‌లో 30 శాతం లోటు, నవంబర్‌లో 96 శాతం లోటు, డిసెంబర్‌లో 95 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ మూడు నెలల్లో 45 శాతం లోటు రికార్డ్‌ అయింది. అయితే సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలే రబీ పంటలకు ప్రాణం పోస్తున్నాయి.

Advertisement
Advertisement