‘104’ కష్టాలు | Sakshi
Sakshi News home page

‘104’ కష్టాలు

Published Tue, Nov 25 2014 2:19 AM

104 system start with cooperation of national health mission

ఆదిలాబాద్ టౌన్ : గ్రామీణులకు నిరంతర వైద్యం అందించాలని ప్రవేశపెట్టిన 104 వాహనాల సేవలకు గ్రహణం పట్టుకుంది. పేరుకు తగ్గట్టే 104 కష్టాలు వాటిని చుట్టుముట్టాయి. వాహనాలుంటే డీజిల్ ఉండదు.. డీజిల్ ఉంటే డ్రైవర్‌లుండరు.. అన్నీ ఉన్నా మందులుండలుండవు అన్న చందంగా తయారైంది వారి పరిస్థితి. దీనికితోడు సిబ్బందికీ వేతనాలూ లేవు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జాతీయ ఆరోగ్య మిషన్ సహకారంతో 104 విధానాన్ని రూపొందించారు.

 గ్రామాలకు వెళ్లి 104 సంచార వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మర ణాంతరం 104 వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాహనాలలో పనిచేసే ఉద్యోగులకూ నెలల తరబడి వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందుల కొరత, వాహనాల మరమ్మతు, సిబ్బందిని నియమించడంలో జాప్యం జరుగుతుండడంతో సేవలు అందకుండాపోతున్నాయి.

 మూలన పడ్డ నాలుగు వాహనాలు
 జిల్లాలో 24  వాహనాలున్నాయి. వీటిలో 20 వాహనాలు మాత్రమే సేవలందిస్తున్నాయి. నాలుగు వాహనాలకు డ్రైవర్, పార్మాసిస్టులను నియమించకపోవడంతో నార్నూర్, ఖానాపూర్, జైనూర్, ముథోల్ క్లస్టర్‌ల పరిధిలోని 104 వాహనాలు నిలిచిపోయాయి. డ్రైవర్ లేరనే సాకుతో అధికారులూ ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు పలు రోగాలతో అవస్థలు పడుతున్నారు. వారికీ 104 సేవలు అందడం లేదు.

 మందుల కొరత..
 ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి వైద్యసేవలందించే 104 వాహనాల్లో 42 రకాలు మందులు అందుబాటులో ఉండాలి. కొంతకాలంగా వావానాల్లో పూర్తిస్థాయిలో మందుల్లేక సిబ్బంది నామమాత్రంగా వైద్య సేవలందిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, దగ్గు, గర్భిణులకు అందించే ఐరన్‌పోలిక్ మాత్రలు, పేయిన్ కిల్లర్, ఫిడ్స్‌కు సంబంధించిన కార్భొజఫమాయిల్, షుగర్‌కు సంబంధించి గ్లేమీఫడ్ మాత్రలు, యాంటిబయాటిక్, తదితర మాత్రలు లేవు. చిన్న పిల్లలకు జ్వరాలకు సంబంధించిన మందు అందుబాటులో లేదు. బడ్జెట్ లేక మందులు కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది.

 వైద్యులు రాక అవస్థలు..
 104 సేవలందించే గ్రామాలకు ఆయా పీహెచ్‌సీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ.. కేవలం ఏఎన్‌ఎంలను మాత్రమే పంపడంతో రోగులకు సేవలందడం లేదు. ఫార్మసిస్టులు గతం నుంచి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే మందులు ఇస్తున్నారు. దీంతో ఎంతో ఆశతో వచ్చిన రోగులు వైద్యం అందకుండాపోతోంది. వైద్యులు అందుబాటులో ఉంటే వివిధ రోగాలతో బాధపడుతున్న వారు వైద్యులకు తమ గోడును వినిపించుకోవచ్చు. ఫార్మసిస్టులు రోగులకు మందులు ఇస్తున్నా వారిలో వ్యాధి నయమవుతుందన్న భరోసా కనిపించక నిరాశకు లోనవుతున్నారు. వాస్తవానికి మెడికల్ ఆఫీసర్ పీహెచ్‌సీలో ఉదయం పూట.. మధ్యాహ్నం నుంచి 104కు హాజరుకావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించినా పెడచెవిన పెడుతున్నారు.

 రెండు నెలలుగా..
 104 వాహనాల్లో సుమారు 140 మంది సిబ్భంది ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. ఈ సిబ్బందిలో వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ఉద్యోగ రీత్యా వీరంతా ఆయా మండల కేంద్రాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వేతనాలు అందకపోవడంతో కనీసం అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే తమ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నట్లు సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికాారులు స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement