ఐఎం ఖాతాలో రూ.200 కోట్లు | Sakshi
Sakshi News home page

ఐఎం ఖాతాలో రూ.200 కోట్లు

Published Mon, Aug 11 2014 5:38 AM

ఐఎం ఖాతాలో రూ.200 కోట్లు

* ఆధారాలు సేకరించిన నిఘా వర్గాలు
* ఈ పరిణామం మంచిది కాదంటున్న అధికారులు
* అల్ కాయిదాతో పోటీ..  దందాలు, ఆయుధాల విక్రయం, బ్లాక్‌మెయిల్‌తో నిధుల సమీకరణ

 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంపై రెండుసార్లు పంజా విసిరి, 4 బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వద్ద ప్రస్తుతం రూ.200 కోట్ల నిధులు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దేశ వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్న ఈ ముష్కరులు అంతర్జాతీయ సంస్థ అల్‌కాయిదాను ఆదర్శంగా తీసుకుని నిధులు సమీకరింస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. 2012లో ఐఎం రూ.45 కోట్లు సమీకరించగా.. 2014 జూన్ నాటికి ఈ మొత్తం రూ.200 కోట్లకు పెరిగిందని చెప్పడానికి అవసరమైన ఆధారాలనూ కేంద్ర నిఘా వర్గాలు సేకరించాయి. దేశంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఉగ్రవాద సంస్థ వద్ద ఈ స్థాయిలో నిధులుండడం ఆందోళన కలిగించే అంశమని హెచ్చరిస్తున్నాయి.
 -    కోల్‌కతాకు చెందిన అమీర్ రజా ఖాన్ స్థాపించిన ఐఎం ఒకప్పుడు కేవలం పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా(ఎల్‌ఈటీ) నుంచి వచ్చే నిధులే ఆధారంగా పని చేసింది.
 -    ఐఎం కార్యకలాపాలు.. భత్కల్ బ్రదర్స్‌గా పిలిచే రియాజ్, ఇక్బాల్ చేతుల్లోకి వెళ్లిన తరవాత సొంత నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. 2000లో కోల్‌కతాకు చెందిన రాయ్‌బర్మన్‌ను బెదిరించి రూ. 3.5 కోట్లు తీసుకున్న ఉగ్రవాదులు.. అప్పటి నుంచి ఇలాంటి పంథానే అనుసరిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
 -    దేశంలో దుశ్చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా కొంతకాలం నిధుల సమీకరణకు బ్రేక్ వేస్తున్న ఐఎం ముష్కరులు.. ఆపై ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ తన ఖజానాను నింపుకుంటున్నారు.
 -    కొన్నేళ్ల క్రితం ఉత్తరాది రాష్ట్రాల్లో కిడ్నాప్‌లకూ పథక రచన చేసిన ఐఎం ఉగ్రవాదులు అవి అంత శ్రేయస్కరం కాదని భావించి వెనక్కు తగ్గినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవనే ఉద్దేశంతో ఈ దందానే కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
 -    గడిచిన కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబైల్లోని బడా హోటళ్ల యజమానుల్ని బెదిరించడం ద్వారానే ఏకంగా రూ.18 కోట్లు వసూలు చేసినట్టు ఆధారాలు సేకరించారు. అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించి ఫోన్లు చేస్తుండటంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆధీనంలో ఉన్న ఈ కేసులూ కొలిక్కిరావట్లేదు.
 -    దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు నిధుల సమీకరణకూ ఐఎం ఉగ్రవాదులు నకిలీ కరెన్సీని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పాక్‌లో ముద్రితమై, బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి వస్తున్న ఈ కరెన్సీని మార్చడంద్వారా రూ.50 కోట్లకు పైగా ఆర్జించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
 -    బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు నేపాల్‌లోనూ అక్రమ ఆయుధాల విక్రయాలను చేపట్టిన ఐఎం.. ఈ వ్యాపారంలో రూ.40 కోట్ల వరకు సమీకరించినట్లు గుర్తించారు. ఉత్తరాదిలో కొన్ని దోపిడీలు, దొంగతనాలకు పాల్పడి మరో రూ.8 కోట్ల వరకు తమ ఖాతాల్లో వేసుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
 -    ఆయా అంశాలను రాష్ట్ర పోలీసు విభాగాలకు చేరవేసిన నిఘా వర్గాలు.. ఇకపై చోటు చేసుకునే భారీ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించాయి. గతంలో చోటు చేసుకుని, ఇప్పటికీ కొలిక్కిరాని, ఎలాంటి ఆధారాలూ లేని కేసుల దర్యాప్తు వేగాన్ని పెంచాలని స్పష్టం చేశాయి.

Advertisement
Advertisement