Sakshi News home page

‘నకిలీ’లా.. నో ప్రాబ్లమ్‌!

Published Fri, Jun 22 2018 1:55 AM

2,000 fake medical certificates issued  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీచర్ల బదిలీల్లో రోజుకో వింత వ్యవహారం వెలుగు చూస్తోంది. ఓ వైపు విద్యాశాఖ వైఖరితో బదిలీల కౌన్సెలింగ్‌ తేదీలు పొడిగిస్తుండగా.. మరోవైపు నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్ల విషయంలో కొందరిపైనే చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ప్రాథమికంగా గుర్తించినా 30 మందిపైనే చర్యలు తీసుకోవడంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపైనా వేటు వేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది..!
ఉపాధ్యాయుడి భార్యకు దీర్ఘకాలిక జబ్బులున్నా లేదా దీర్ఘకాలిక జబ్బులు, మానసిక వికలాంగులున్న పిల్లలున్నా వారికి విద్యాశాఖ 10 పాయింట్లు ఇస్తుంది. దీనికి మెడికల్‌ బోర్డుల నుంచి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఇదే అదనుగా కొందరు టీచర్లు అడ్డదారిలో నకిలీ సర్టిఫికెట్లు పొంది ప్రాథమిక సీనియారిటీ జాబితాలో అదనపు పాయింట్లు సాధించారు.

ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో తేరుకున్న శాఖ.. కొన్ని దరఖాస్తులను లోతుగా పరిశీలించి నకిలీవని తేల్చింది. కొందరు స్వచ్ఛందంగా మెడికల్‌ కేటగిరీ పాయింట్లు రద్దు చేయా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు ప్రాథమికంగా తేల్చారు. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లపై ఆయా జిల్లా కలెక్టర్లు వేటు వేశారు. కానీ మిగతా జిల్లాల్లో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.  

చర్యలు కొందరిపైనే!
బదిలీ దరఖాస్తుల్లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారందరిపై చర్యలు తీసుకోకుండా కొందరిపైనే విద్యాశాఖ వేటు వేయడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. దరఖాస్తు ల పరిశీలనలో నకిలీవని తేలితే తప్పనిసరిగా వేటు వేయాలని ఇప్పటికే డిమాండ్‌ చేశాయి.

కానీ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పదుల సంఖ్యలో టీచర్లపైనే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2,000 మంది బోగస్‌ సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించినా దాదాపు 30 మందిపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం.  

ఆ వైద్యాధికారులపై చర్యలేవి?
ఒక్కో నకిలీ సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వైద్యాధికారులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంగనర్, నిజామాబాద్‌ జిల్లాల్లోనే ఎక్కువగా మెడికల్‌ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

దీర్ఘకాలిక జబ్బులతో పాటు వైకల్య నిర్ధారణలోనూ ఇదే తరహా నకిలీలు పుట్టుకొచ్చినట్లు సమాచారం. అడ్డగోలుగా సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, వీటిని ముంద స్తుగా కట్టడి చేసి ఉంటే ఇంత భాగోతం జరిగేది కాదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. టీచర్లతో పాటు వైద్యాధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి: పీఆర్టీయూ
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి కోరారు. సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపైనా చర్యలు తీసుకోవాల న్నారు. మెదక్‌ జిల్లాలో కొందరు టీచర్లు సరైన సర్టిఫికెట్లు ఇచ్చినా వారిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారని, సస్పెన్షన్‌ను వెనక్కు తీసుకోవాలని కోరారు. బదిలీల సమయంలో గందరగోళం నెలకొనడంతో మిగతా టీచర్లు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు లోతు గా పరిశీలిస్తే ఇబ్బందులుండవని టీఆర్‌టీఎఫ్‌ గౌరవాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement