2010కి ముందు ఆటోలను నిషేధించాలి

25 Oct, 2017 03:09 IST|Sakshi

హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. స్పందించిన ధర్మాసనం

కాలుష్య వివరాలను సమర్పించాలని కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశం

విచారణ నాలుగు వారాలకు వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో 2010కి ముందు రిజిస్టరైన బీఎస్‌1, బీఎస్‌2 ఆటోలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 2010కి ముందున్న వాహనాలు ఎన్ని?.. వాటి వల్ల కలుగుతున్న కాలుష్యం ఎంత? 2010 తర్వాత ఎన్ని వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి? వాటి వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతోంది? వంటి వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ మంతోజ్‌ గంగారావుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 2010లో రిజిస్టరైన బీఎస్‌1, బీఎస్‌2 ఆటోలపై నిషేధం విధించి, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ఆటోలనే అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సంతకుమార్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. పాత ఆటోల వల్ల కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. కాలుష్యానికి ఆటోలనే కారణంగా చూపడం సరికాదంది. ఆటోలు పేదవాళ్లు నడుపుకునేవని, కార్లు, బస్సుల వల్ల కాలుష్యం రావడం లేదా అని ప్రశ్నించింది.

ఆటోలను నిషేధిస్తే వాటిపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఏమిటని నిలదీసింది. దీనికి కృష్ణయ్య స్పందిస్తూ.. దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ సారి బాణసంచా కాల్చడం తగ్గిందని, ప్రజల్లో అవగాహన రావడమే దీనికి కారణమని తెలిపింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు