మూడు వారాలు.. 128 మరణాలు!

22 Jun, 2020 03:56 IST|Sakshi

రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య కొన్ని రోజులుగా వందల్లో నమోదవుతోంది. గత 3 వారాలుగా పాజిటివ్‌ కేసులు నమోదవు తున్న వేగంలోనే మరణాలు సైతం నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు (జూన్‌ 21 వరకు గణాంకాల ప్రకారం) కరోనా బారినపడి 210 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో జూన్‌ 1 నుంచి 21 వరకు ఏకంగా 128 మంది మరణించారు. మొత్తం మరణాల్లో ఈ సంఖ్య 60.95% కావడం గమనార్హం. అదే మే 21 నుంచి చూస్తే మరణాల శాతం 80.95గా ఉంది. మే 21 నుంచి జూన్‌ 21 మధ్య 170 మంది మృత్యువాతపడ్డారు. ఈ లెక్కన కేసులు పెరుగుతున్న క్రమంలోనే మరణాలు సైతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత 4రోజులుగా కేసుల నమోదు మరింత పెరిగింది. గత శుక్ర, శనివారాల్లోనే వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఏకంగా 730 మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మరణాల శాతం 3.22గా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 2.69 శాతంగా ఉంది. దీంతో దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువ మరణాలే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు