జనవరి 1 నుంచి నిరంతర విద్యుత్‌ | Sakshi
Sakshi News home page

జనవరి 1 నుంచి నిరంతర విద్యుత్‌

Published Fri, Dec 8 2017 1:20 AM

24 hours Current from jan 1st says jagdheshwarreddy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ అధ్యక్షతన ఢిల్లీలో గురువారం నిర్వహించిన అన్ని రాష్ట్రాల విద్యుత్‌ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో అందరికీ విద్యుత్‌ సరఫరా చేయడమే కేంద్రం లక్ష్యమని, దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ సూచించారు. పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ నష్టాలు అధికంగా ఉన్నాయని, నష్టాల్లో ఒక శాతం విద్యుత్‌ నష్టాన్ని తగ్గించుకున్నా ప్రతి ఏడాది రూ. 306 కోట్లు ఆదా చేయవచ్చని అన్నారు. విద్యుత్‌ నష్టాల తగ్గింపు దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరికీ విద్యుత్‌ సదుపాయం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.30 కోట్ల గృహాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించామని, మిగిలిన 3.5 లక్షల ఇళ్లకు మే నాటికి విద్యుత్‌ సదుపాయం కల్పించి సంపూర్ణ విద్యుత్‌ సరఫరా రాష్ట్రంగా తెలంగాణను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.

మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ..
రైతులకు ఇప్పటికే 9 గంటల పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాను ప్రారంభించనున్నట్లు మం త్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. దీని వల్ల 25 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగు తుంద న్నారు. దేశంలో రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిం చనుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే అంధకారమే అని కొంత మంది ఆరోపణలు చేశారని, ఇప్పుడు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ పురోగతి సాధించిందని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృషే కారణమన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ ప్రశంసించారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement