‘అత్యాచారం’పై 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్ | Sakshi
Sakshi News home page

‘అత్యాచారం’పై 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్

Published Sat, Jan 9 2016 2:29 AM

‘అత్యాచారం’పై 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్ - Sakshi

* నిందితులపై చట్ట ప్రకారం చర్యలు
* విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్
* ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పిస్తామని హామీ

ఇందూరు : ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు జరిగిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వివరాలను ఎస్పీతో పాటు కలెక్టరేట్‌కు పంపాలని కలెక్టర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రగతి భవన్‌లో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై జరిగిన అత్యాచార సంఘటనలు, నమోదైన కేసులపై చేపట్టిన చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార సంఘటనలకు సంబంధించి 62 కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయని, మరో 25 సంఘటనలు ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేందుకు రూ. 15 వేల చొప్పున 2014లో 50 మందికి, 2015లో 16 మందికి ప్రభుత్వంనుంచి ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. ప్రతివారం నమోదైన కేసుల వివరాలను డీఎస్పీల వారీగా అందజేయాలని ఆదేశించారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన వెంటనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాలో 25 శాతం విడుదల చేయనున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చార్జిషీట్లు దాఖలు చేయాలని, దాని ప్రతులను మండల స్థాయి జెండర్ కమిటీలకు పంపాలని సూచించారు.
 
సామాజిక వివక్షపై ఆందోళన
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కుల బహిష్కరణ, దేవాలయాల్లోకి ప్రవేశాల నిషేధం తదితర సామాజిక వివక్షలు కొనసాగడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదుపై స్పందించాలని పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను, అట్రాసిటీ కమిటీ సభ్యులను కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను కల్పించేందుకు ఇక నుంచి ప్రతి నెలా 30వ తేదీన పౌరహక్కుల దినోత్సవంగా జరుపనున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్సీ, ఎస్టీ గ్రామాలు, కాలనీలలో పర్యటిస్తామన్నారు.
 
అవగాహన సదస్సులు నిర్వహిస్తాం
అలాగే సాంఘిక సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇటు ఇంటర్, డిగ్రీ విద్యార్థినులకు ఎస్సీ, ఎస్టీల హక్కుల సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, ఏర్పాటు చేసిన యంత్రాంగం గురించి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 714 ఎకరాల భూ పంపిణీ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తోందని, ఈనెల 30వ తేదీ నాటిని లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
 
సామాజిక వివక్షను నిర్మూలించేందుకు కల్పించిన చట్టపరమైన హక్కుల గురించి పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. సమాజంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా వివక్షకు గురి కారాదని, అదే సమయంలో ఏ వ్యక్తి కూడా అన్యాయంగా శిక్షించబడరాదని పేర్కొన్నారు. కక్షలతో కావాలనే అట్రాసిటీ కేసులు పెట్టిన చాలా సంఘటనలున్నాయని, అవి కూడా విచారించి నిజానిజాలు తేల్చాలని సూచించారు. చట్టాన్ని తప్పుడు పనులకు ఉపయోగించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
 
‘గుర్తింపు’ ఇవ్వాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార సంఘటనలపై ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయడం లేదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తద్వారా కేసులు నీరుగారిపోతున్నాయన్నారు. కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డి, ఏజేసీ రాజారాం, ఐకేపీ పీడీ వెంకటేశం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విజయ్ కుమార్, కమిటీ సభ్యులు సాయిలు, నాగభూషణం, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement