పోలింగ్ 34.19 శాతమే | Sakshi
Sakshi News home page

పోలింగ్ 34.19 శాతమే

Published Mon, Mar 23 2015 6:43 AM

34.19 per Cent Graduates Vote in MLC Election in RR

 
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు స్పందన అంతంతమాత్రమే..
 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు నెలరోజులుగా అటు రాజకీయ పార్టీలు, ఇటు ఉద్యోగ, విద్యార్థి సంఘాలు చేసిన ప్రచార పర్వం తాలుకూ ప్రతిఫలంలో భాగంగా ఆదివారం ఓటర్లు తమ ఓటుతో నిర్ణయాన్ని ప్రకటించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 1,37,261 ఓట్లున్నాయి. మిగతా రెండు జిల్లాల్లో కంటే ఇక్కడ ఓట్లు అధికంగా ఉండడంతో పోలింగ్ తీరు గెలుపోటములపై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు సైతం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ.. చివరకు పోలింగ్ నాడు మాత్రం విలువైన ఓటు హక్కును  వినియోగించుకునేందుకు తీవ్ర నిరాసక్తత చూపారు. కేవలం 34.19 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. 
 అంతా మందకొడిగానే..
 జిల్లాలోని 170 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఎనిమిది గంట లకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల ఎన్నికల సంఘం ఓటరు చైతన్యం పేరిట పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టడం, గతేడాది స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో సైతం పోలింగ్ శాతం భారీగా పెరగడంతో తాజా పోలింగ్‌పై అంచనాలు పెరి గాయి. కానీ ఆదివారం నాటి పోలింగ్ తీరును పరిశీలిస్తే.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కేవలం 34.19 శాతం మాత్రమే ఓటింగ్‌కు హాజరయ్యారు. 
 తొలి గంటన్నర వ్యవధిలో కేవలం 8 శాతం మాత్రమే పోలింగ్ జరగగా.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓటింగ్ కొంత పుంజుకుని 18 శాతానికి పెరిగింది. అనంతరం రెండు గంటల ప్రాంతంలో ఓటింగ్ మందకొడిగానే సాగుతూ 27.63శాతానికి చేరుకుంది. చివరకు నాలుగు గంటల ప్రాంతంలో 34.19శాతానికి పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 1,37,261 మంది ఓటర్లున్నారు. ఇందులో కేవలం 46,930 మంది మాత్రమే ఓటు వేయగా.. 90,330 మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి దూరంగా ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement