పత్తి కొనుగోలుకు 386 కేంద్రాలు  | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోలుకు 386 కేంద్రాలు 

Published Sun, Sep 23 2018 3:04 AM

386 centers for cotton purchase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి 386 కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌ మంత్రి టి.హరీశ్‌రావు భారత పత్తి సంస్థ (సీసీఐ)ను ఆదేశించారు. అందులో 98 మార్కెట్‌ యార్డుల్లో, 288 కొనుగోలు కేంద్రాలు జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాటు చేయాలన్నారు. 25 ముఖ్య మార్కెట్‌ యార్డు కేంద్రాల్లో వచ్చే నెల 10లోగా, మిగిలిన కేంద్రాలను 20వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు మంత్రి శనివారం మార్కెటింగ్, వ్యవసాయశాఖలు, మార్క్‌ఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, సీసీఐ అధికారులతో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుముల కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెండర్లలో పాల్గొన్న 288 జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసేలా జిల్లా కలెక్టర్లు, సీసీఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా నుంచి జిన్నింగ్‌ మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనకపోవడంపై హరీశ్‌ అధికారులను ప్రశ్నించారు. ఆ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని సీసీఐ సీఎండీని ఫోన్‌లో కోరారు. అలాగే సీసీఐ సంచాలకులు అల్లిరాణితో ఫోన్‌లో చర్చించి జిన్నింగ్‌ మిల్లుల యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.  

నిర్ణీత శాతం తేమ ఉండేలా చూసుకోండి... 
రైతులు పత్తిని మార్కెట్‌ యార్డులకు తెచ్చేటప్పుడు శుభ్రపరిచి, ఆరబెట్టి తేమ 8% నుంచి 12% మా త్రమే ఉండేటట్లు చూసుకొని తెస్తే సరైన ధర వస్తుం దని దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను హరీశ్‌ ఆదేశించారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.5,450గా కేంద్రం నిర్ణయించిందని, నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా పత్తిని తెచ్చి ఆ మేరకు లబ్ధి పొందాలని రైతులను కోరారు. మొక్కజొన్నల కొనుగోలుకు 259 కేంద్రాలను తెరవాలని మార్క్‌ఫెడ్‌ ఎం డీని కోరారు. పెసర కొనుగోలుకు 9 కేంద్రాలను ప్రా రంభించాల్సిందిగా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కందులు, మినుములు, వేరుశనగ మద్దతు ధర కొనుగోలుకు ముందస్తు అనుమతి తీçసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్, హాకాల ఎండీ సురేందర్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, మార్క్‌ఫెడ్‌ పంట ఉత్పత్తుల సేకరణ మేనేజర్‌ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement