మండుతున్న ఎండలు.. ఆగుతున్న గుండెలు | Sakshi
Sakshi News home page

మండుతున్న ఎండలు.. ఆగుతున్న గుండెలు

Published Thu, May 3 2018 2:22 AM

40 People Died Due TO Sunstroke In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండల తీవ్రతకు జనజీవనం అల్లాడిపోతోంది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు మించి నమోదవుతుండటంతో వడదెబ్బకు మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత పదిరోజుల్లో 40 మందికిపైగా మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. అయితే వివరాలను అధికారికంగా బయటపెట్టడం లేదు. మే నెల ప్రారంభం కావ డంతో పరిస్థితి ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుం దోననే ఆందోళన నెలకొంది. 

వడగాడ్పులు మరిన్ని రోజులుంటాయని, 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పిల్లలు, వృద్ధులపై ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు ఎండవేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఎండలకు కూలీలు దొరకడం లేదు. వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అనేకచోట్ల ధాన్యం భూమి మీదే రాలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశాలు కనిపించడం లేదు. 

ప్రణాళిక ఘనం.. ఆచరణ శూన్యం 
కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులకు విపత్తు నిర్వహణ శాఖ వేసవి ప్రణాళికను అందజేసింది. ప్రణాళికను ఘనంగా తయారు చేసినా దాని అమలులో మాత్రం ఘోర వైఫల్యం కనిపిస్తోంది. మొబైల్‌ ఫోన్లలో మెసేజ్‌లు, వాట్సాప్‌ తదితర పద్దతుల ద్వారా వడదెబ్బ, ఎండ వేడిమి హెచ్చరికలను ఎప్పటికప్పుడు జనానికి చేరవేయాలన్న విపత్తు నిర్వహణ శాఖ సూచనలను పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలు కావడం లేదని ప్రజలు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయీడ్స్‌ అందుబాటులో ఉంచాలన్న నిబంధన ఆచరణలో పెట్టడం లేదు. 

వివిధ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాల ఏర్పాటులోనూ లోపం కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయి. గుళ్లు, ప్రభుత్వ భవన సముదాయాలు, మాల్స్‌ తదితర చోట్ల ప్రజలకు నీడ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని జిల్లాల్లో పెద్దగా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎండల తీవ్రత, జాగ్రత్తలపై విరివిగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతర సమాచారాన్ని ముద్రించి ఇవ్వాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇక పశువులకు నీటి వసతికి దిక్కే లేదు. 

ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల సమయ వేళలను మార్చాలని పేర్కొన్నా ఆచరణలో కనిపించడంలేదు. ప్రధాన బస్టాండ్లలో ఆరోగ్య బృందాలు ఏర్పాటు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. కానీ అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదని ప్రయాణికులు వాపోతున్నారు. అత్యవసరమైతే తప్ప.. వడగాడ్పులు తీవ్రంగా ఉన్న సమయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు బస్సులను తిప్పకూడదు. కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతూ బస్సులను తిప్పుతున్నారు. ఏసీ బస్సులు కాకుండా ఇతర బస్సుల్లో ఇలాంటి సమయంలో ప్రయాణిస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి 
– ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. 
– తెలుపు లేదా లేత వర్ణం కా>టన్‌ వస్త్రాలు ధరించాలి. 
– పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. 
– వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి.  
– వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.  


 

Advertisement

తప్పక చదవండి

Advertisement