నాలుగు రోజులుగా పాఠశాలకు తాళం..! | Sakshi
Sakshi News home page

నాలుగు రోజులుగా పాఠశాలకు తాళం..!

Published Fri, Jan 30 2015 3:44 AM

నాలుగు రోజులుగా పాఠశాలకు తాళం..!

పట్టించుకోని ఎంఈఓ
చేగుంట: చేగుంట ఎంఈఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల నాలుగు రోజులుగా తెరుచుకోక పోవడంతో స్థానిక కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని సుబాష్‌నగర్ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో బుడగ జంగాలకు చెందిన 45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికోసం ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల ప్రత్యేక నిధులతో వలంటీర్‌ను నియమించారు.

వలంటీర్‌కు వేతనం ఇవ్వకపోవడంతో పాఠశాలకు రావడం మానివేశాడు. దీంతో కాలనీ వాసులు ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించగా స్పందించిన డిప్యూటీఈఓ శోభారాణి వలంటీర్‌తో పాఠశాల నడిపించాలని ఎంఈఓకు సూచించారు. అయితే ఎంఈఓ సమస్యను పట్టించుకోకపోవడంతో నాలుగు రోజులుగా పాఠశాల తెరుచుకోలేదు.

ఎంఈఓ లింగారెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటినుంచి తమ కాలనీ పాఠశాలను పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు తెలిపారు. పాఠశాలకు తాళం వేసిన విషయమై డీఈఓ రాజేశ్వర్‌రావును వివరణ కోరగా విచారణ జరిపిస్తామని, అలాగే సుభాష్‌నగర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement