9 నుంచి ‘ఆపరేషన్ గణేశ’ | Sakshi
Sakshi News home page

9 నుంచి ‘ఆపరేషన్ గణేశ’

Published Sun, Sep 7 2014 12:47 AM

9 నుంచి ‘ఆపరేషన్ గణేశ’

  •  సాగర్ శుద్ధికి హెచ్‌ఎండీఏ  ఏర్పాట్లు
  •   వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్
  • 3సాక్షి, సిటీ బ్యూరో: హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్ర హ శకలాలను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఏరోజు నిమజ్జనమయ్యే విగ్రహాలను ఆ రోజే గట్టుకు చేర్చి, జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు చిన్నా, పెద్ద విగ్రహాలు సుమారు 16 వేలకు పైగా నిమజ్జనమై ఉంటాయని అంచనా.

    ఈ నెల 8తో వినాయక నిమజ్జన ప్రధాన ఘట్టం ముగియనుంది. 9వ తేదీ మధ్యాహ్నం నుంచే సాగర్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా 5 రోజుల్లోగా వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్‌ఈ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. ప్రముఖుల రాకపోకలు అధికంగా ఉండే ఎన్టీఆర్ మార్గ్ వైపు 9 ఫ్లాట్‌ఫారాల వద్ద శకలాలను తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.

    దీని కోసం 2 డ్రెడ్జింగ్ యుటిలిటీ క్రాఫ్ట్ (డీయూసీ)లు, 2 జేసీబీలు, 10 టిప్పర్లు, 80 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు ఎస్‌ఈ తెలిపారు. ఇప్పటి వరకు 1100 టన్నుల వ్యర్థాలను తరలించామన్నారు. ఫ్లాట్‌ఫారాల వద్ద క్రేన్లు అడ్డుగా ఉండటంతో అక్కడి వ్యర్థాలను తొలగించడం ఇబ్బందిగా ఉందన్నా రు. ఇవి నీటిలోకి జారిపోయి సాగర్ కలుషితం కాకుం డా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది 3,740 టన్నుల వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉందన్నారు.
     
    మొక్కుబడి తంతేనా...

    ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా...కేవలం ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపడుతుండటం హెచ్‌ఎండీఏ చిత్త‘శుద్ధి’కి అద్దం పడుతోంది. ట్యాంక్‌బండ్ వైపులోతుగా ఉండడంతో పూడిక తొలగింపు సులభం కాదంటూ కొన్నేళ్లుగా దాటవేస్తున్నారు. నీటిపై తేలిన విగ్రహాలు, పూలు పత్రి వంటి వాటిని డీయూసీ, బోట్ల ద్వారా గట్టుకు చేరుస్తున్నారే తప్ప, అడుగుకు చేరుకున్న విగ్రహాల జోలికి వెళ్లట్లేదు. దీంతో పూడిక భారీగా పేరుకుపోతోంది. ఇది ట్యాంకు బండ్ ఉనికికే ప్రమాదమని, నీటి నిల్వ సామర్థ్యం ఘననీయంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
     

Advertisement
Advertisement