9 వర్సిటీలకు నియమించేందుకు చర్యలు | Sakshi
Sakshi News home page

9 వర్సిటీలకు నియమించేందుకు చర్యలు

Published Thu, Dec 3 2015 3:45 AM

9 వర్సిటీలకు నియమించేందుకు చర్యలు

ఇప్పటికే సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్లను (వీసీ) నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏళ్ల తరబడి రెగ్యులర్ వీసీలు లేక ఇన్‌చార్జీల పాలనలో అల్లాడుతున్న వర్సిటీలకు ఎట్టకేలకు రెగ్యులర్ వీసీలను నియమించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. తాజాగా  ఈ నెల 3న (గురువారం) వీసీ పోస్టుల నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు సిద్ధమైంది. 4వ తేదీన నోటిఫికేషన్‌ను అందరికి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ వర్సిటీలతో పాటు 10 వర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు.

దీంతో యూనివర్సిటీల్లో పాలనతోపాటు విద్యా కార్యక్రమాల అమ లు పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మినహా మిగతా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, జేఎన్‌టీయూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పాలమూరు విశ్వ విద్యాలయం, మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలకు వీసీల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.

 పాత పద్ధతిలోనే నియామకాలు
 ఈ నియామకాలను పాత పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే అర్హత కలిగిన ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పదేళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలన్న నిబంధన ప్రధానమైంది. దాంతోపాటు వారి ప్రత్యేకత, ఎన్ని పీహెచ్‌డీలకు, ఎన్ని ఎంఫిల్‌లకు గైడ్ చేశారు? ఎన్ని పేపర్లు రాశారు? ఎన్ని పుస్తకాలు రాశారు?  తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో వర్సిటీకి వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా సెర్చ్ కమిటీ ప్రాసెస్ చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న ప్రొఫెసర్ల సీనియారిటీ, అర్హతలను బట్టి ప్రాధాన్య క్రమంలో ముగ్గురి పేర్లను సెర్చ్ కమిటీ ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపుతుంది.

 ప్రభుత్వం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరి పేరును ఆ వర్సిటీకి వీసీగా ఖరారు చేయనుంది. గతంలో యూనివర్సిటీకి చాన్స్‌లర్‌గా ఉండే గవర్నర్ వీసీని నియమించగా, ఇపుడు ప్రభుత్వమే వీసీని నియమించనుంది. రాష్ట్రంలో యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్ స్థానంలో నిఫుణులను ప్రభుత్వమే నియమించాలని నిర్ణయించింది. అలాగే వీసీల నియామక అధికారాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇటీవలే అందుకు అనుగుణంగా యూనివర్సిటీల చట్టాలకు సవరణలు చేసింది. తాజా నిబంధన ప్రకారం వీసీలను, ఆ తరువాత చాన్స్‌లర్లను ప్రభుత్వమే నియమించనుంది.
 

Advertisement
Advertisement