ప్రైవేటు వైద్యశాల ఎదుట ఆందోళన | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వైద్యశాల ఎదుట ఆందోళన

Published Sun, Apr 19 2015 4:36 AM

a baby dies through irresponsibilty of hospital staff

- చికిత్స పొందుతూ
- నాలుగు నెలల పాప మృతి
- సిబ్బంది నిర్లక్ష్యం అంటూ
- బంధువుల ఆరోపణ
ఇల్లెందు :
సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ పసిబిడ్డ చనిపోరుుందని ఆరోపిస్తూ శనివారం ఇల్లెందు పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాల ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...పట్టణంలోని 14 నంబర్ బస్తీకి చెందిన రతన్, భారతిల నాలుగు నెలల కూతురు జ్వరంతో బాధపడుతుండడంతో మూడు రోజుల క్రితం స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యుడు చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపి మందులిచ్చి ఇంటికి పంపించాడు.

 మరుసటి రోజు చిన్నారికి జ్వరం తీవ్రతరం కావడంతో తల్లిదండ్రులు మళ్లీ వైద్యశాలకు వచ్చారు. వైద్యుడు లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక వైద్యం చేసి ఇంటికి పంపించారు. రెండు రోజులుగా డాక్టర్ లేకపోవడంతో సిబ్బందే వైద్యం చేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో తాము ఏమి చేయలేము ఖమ్మం ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందిగా వైద్యశాల సిబ్బంది తెలిపారు. చిన్నారిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లే క్రమంలోనే మార్గ మధ్యలో మృతి చెందింది.

ప్రైవేట్ వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యశాల ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి తల్లిదండ్రులకు మంద్దతుగా నిలిచారు. సమాచారం తెలిసిన పోలీసులు వైద్యశాలకు వెళ్లి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని వైద్యుడు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
 

Advertisement
Advertisement