‘అమ్మ’మ్మా.. | Sakshi
Sakshi News home page

‘అమ్మ’మ్మా..

Published Wed, Mar 29 2017 4:10 AM

‘అమ్మ’మ్మా..

- మగ సంతానం కోసం పదో కాన్పు వరకు వేచిచూసిన దంపతులు
- ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ
- పదకొండు మంది సంతానంలో బతికున్నది ఐదుగురే..


చందంపేట: ఒకటికాదు..రెండు కాదు.. వరుసగా పది కాన్పులు. పదకొండు మంది సంతానం. పదిహేనేళ్ల క్రితం వివాహమైన ఆ మహిళ 180 నెలల్లో ఏకంగా 90 నెలలు బిడ్డలను మోస్తూనే ఉంది.. ఆడశిశువులు పుట్టడం.. వారిని సాకలేకమని శిశుగృహాల పాలు చేస్తూనే.. మగ బిడ్డ కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. చివరకు పదో కాన్పులో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి.. మగ సంతానం కావాలనే కాంక్షను తీర్చుకుంది. నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మగ సంతానం పట్ల గిరిజనులకున్న మోజుకు ఈ ఘటన అద్దం పడుతోంది.

చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి గ్రామపంచాయతీ మోత్యతండాకు చెందిన నూన్సావత్‌ బద్యా, లక్ష్మీ దంపతులకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. అయితే మొదటి కాన్పు నుంచి తొమ్మిదో కాన్పు వరకు లక్ష్మీ ఆడ పిల్లలనే జన్మనిచ్చింది. అయితే మగ పిల్లాడు కావాలనే కొరికతో పదో కాన్పు వరకూ ఆ దంపతులు వేచి చూశారు. తాజాగా లక్ష్మి ఈ నెల 22న పదవ కాన్పులో ఆడ, మగ శిశువులకు జన్మనిచ్చింది.

ఇదిలా ఉంటే సదరు దంపతులు గతంలో రెండు కాన్పుల్లో జన్మించిన ఆడ శిశువులను సాకలేమని దేవరకొండ, నల్లగొండ ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. పుట్టిన పదకొండు మందిలో ప్రస్తుతం ఐదుగురు పిల్లలు మాత్రమే బతికుండగా మిగతా పిల్లలు అనారోగ్య కారణాలతో చనిపోయారని వారి బంధువులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు పదవ కాన్పులో పుట్టిన ఆడ శిశువును అయినా సాకుతారా లేదా అనేది వేచిచూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement