రేపటి నుంచి సంపూర్ణ భోజన పథకం | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సంపూర్ణ భోజన పథకం

Published Thu, Jan 1 2015 6:30 AM

A full meal plan from tomorrow

  • న్యూ ఇయర్ నుంచి నూతన పథకానికి శ్రీకారం
  • పోషకాహార లోపాన్ని నివారించేందుకే..
  • హైదరాబాద్‌లో 1.17 లక్షల మందికి లబ్ధి
  • సాక్షి, సిటీబ్యూరో: పోషకాహార లోపం వల్ల జరిగే మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి కొత్త పథకానికి శ్రీకారం చుడుతుంది. ‘ఒక సంపూర్ణ భోజన’ పథకం పేరిట జనవరి ఒకటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించడానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది. గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు పోషక స్థాయిని పెంచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల తల్లులు, పిల్లల మరణాలు పెరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నూతన పథకాన్ని రూపొందించింది.

    ఈ పథకం ద్వారా హైదరాబాద్‌లోని 940 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లక్షా 17 వేల 720 మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట భోజనాన్ని అందించనున్నారు. గర్భిణులకు తొమ్మిది నెలలు, బాలింతలకు ఆరు నెలలు, పిల్లలకు ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు వారికి ఇది వర్తిస్తుంది.
     
    ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో 27,720 మంది గర్భిణులు, బాలింతలు, ఏడు నెలలు నుంచి మూడు సంవత్సరాల వయస్సున్న పిల్లలు 70 వేల మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సున్న 20 వేల మందికి ఆరోగ్య సంరక్షణ, జాగ్రత్తలు, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తేల్సిందే. ఈ పథకాన్ని సికింద్రాబాద్‌లోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో లాంఛనంగాప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పద్మారావును ఆహ్వానించనున్నారు.
     
    ‘ఒక సంపూర్ణ భోజన’ పథకం ఇలా...
    గర్భిణులు, బాలింతలకు రోజూ ఒక పూట భోజనంలో 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, 200 మీ.లీ. పాలు, ఒక కోడి గుడ్డు , 50 గ్రాముల కూరగాయలను వంటి పోషక విలువలతో అందిస్తారు.
     
    (గతంలో గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కిలోల బియ్యం, అర కిలో నూనె, కిలో పప్పు, 16 గుడ్లు ఇచ్చేవారు)
     
    ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు రోజూ బాలామృతంతోపాటు నెలకు 16 గుడ్లు అందిస్తారు. (గతంలో వీరికి వారానికి రెండు గుడ్లు, బాలామృతం ఇచ్చేవారు)
     
    మూడేళ్ల నుంచి 6 ఆరేళ్ల వయస్సు పిల్లలకు రోజూ ఒక పూట భోజనంలో 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 25 గ్రాముల కూరగాయలు, 5 గ్రాముల నూనె, ఒక గుడ్డు, 15 గ్రాముల స్నాక్స్‌తో కూడిన పోషకాహారాన్ని అందిస్తారు.
     
    (గతంలో వీరికి వారానికి నాలుగు గుడ్లు, రోజూ కూరగాయలు లేదా ఆకుకూరలతో పప్పు ఇచ్చేవారు).

Advertisement
Advertisement