ఘనంగా క్రిస్మస్ వేడుకలు | Sakshi
Sakshi News home page

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Published Fri, Dec 26 2014 12:47 AM

A grand celebration of Christmas

చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు
శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

 
మహబూబ్‌నగర్ కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏంబీసీ చర్చితో పాటు ఫాతిమానగర్, లూర్దునగర్, శాంతినగర్ , వెలగొండకాలనీలో క్రి స్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తుమహిమలను పాటల ద్వారా కొనియాడారు. అంతకుముందు వారం రోజులుగా క్రీస్తు జనాన్ని సూచిస్తూ క్రిస్మస్ ట్రీ, స్టార్లన ప్రత్యేకంగా అలంకరించారు. ప్రార్థనల అనంతరం అన్ని మతాల వారు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం అన్నదానం, వస్త్రదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చీ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, పాస్టర్  రెవరెండ్ ఎస్.వరప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. సికింద్రాబాద్‌కు చెందిన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆక్సిలరీ సెక్రటరీ రెవరెండ్ బి.రాజశేఖర్ ముఖ్య ప్రసంగీకుడిగా హాజరై విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న స్థానిక ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్ క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పారు.

ప్రజలు క్రీస్తుమార్గంలో నడవాలని కోరారు.  కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ కృష్ణమూర్తి, డీసీసీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా నేతలు జెట్టి రాజశేఖర్, హైదర్‌అలీ, కోస్గి నసీర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డి పట్టణ ప్రముఖులు, వి.మనోహర్‌రెడ్డి, సీజే బెనహర్, సయ్యద్ ఇబ్రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 తనకు హానిచేసిన వారిని కూడా ప్రేమించమని చెప్పిన క్రీస్తు బోధనలు పాటిస్తే సమాజంలో శాంతి నెలకొంటుందని గద్వాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేడీకే అరుణ అన్నారు. గద్వాల పట్టణంలో ఎంబీ మిస్పా చర్చి, కర్మెలు ప్రార్థన మందిరాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని కోరారు.  

 జడ్చర్లలోని గాంధీచౌరస్తాలో ఉన్న పెంథకోస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విద్యుత్‌శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సతీమణి డాక్టర్ శ్వేత పాల్గొన్నారు. క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తుమార్గం అనుసరణీయని అన్నారు. ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని కోరారు.

వనపర్తిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మానవాళిని రక్షించేందుకు ఏసు జన్మించాడని, ఎన్నో కష్టాలు అనుభవించాడని అన్నారు. పీడనకు గురవుతున్న ప్రజలు బాగుపడాలని ప్రార్థనలు చేయాలని కోరారు.
 
కొత్తకోటలో నిర్వహించిన వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచ రణీయమన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
 

Advertisement
Advertisement