నిధుల దుర్వినియోగంపై దర్యాప్తునకు ఆదేశించండి | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగంపై దర్యాప్తునకు ఆదేశించండి

Published Sun, Sep 25 2016 2:52 AM

a pil in high court on funds misuse

హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: మౌలానా అబ్దుల్ కలామ్ సుజల స్రవంతి కింద గోదావరి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు సంబంధించిన పైప్‌లైన్ల నిర్మాణంలో రూ.24 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని హైదరాబాద్‌కు చెందిన పొన్నాల శశికుమార్ దాఖలు చేశారు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జలమండలి ఎండీ, జలమండలి మాజీ ఎండీ జగదీశ్వర్, ఆపరేషన్ డెరైక్టర్ జి.రామేశ్వర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘గోదావరి నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు రూ.3,375 కోట్లతో 186 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది.

ఇందులో గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక నుంచి ఘన్‌పూర్ రిజర్వాయర్ వరకు 58 కిలోమీటర్ల మేర రూ.810 కోట్ల విలువైన పైపులైన్ నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ-కెబీఎల్-మేటాస్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది. పైపులైన్ వేసేందుకు కొన్ని నిర్మాణాలు అడ్డుగా వస్తున్నందున అలైన్‌మెంట్ మార్చాలని జలమండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.23.35 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని తేల్చారు. వాస్తవానికి ఇక్కడ అదనపు పైపులైన్ నిర్మాణం చేపట్టనే లేదు. నాణ్యతను పరిశీలించిన వ్యాప్‌కోతో జగదీశ్వర్, రామేశ్వర్, ఎల్‌అండ్‌టీ జేవీ కుమ్మక్కయ్యారు.

చేయని పనులను చేసినట్లు బోగస్ బిల్లులు సష్టించారు. అడిగిందే తడవుగా అదనపు పనుల పేరుతో రూ.23.35 కోట్లు విడుదల చేశారు. దీనిపై అన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించాను. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరాను. అయినా కూడా అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాలి’ అని సాయికుమార్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.
 

Advertisement
Advertisement