కలకలం | Sakshi
Sakshi News home page

కలకలం

Published Mon, Jun 23 2014 3:35 AM

కలకలం - Sakshi

  •      నగరంలో వరుస ఘటనలు
  •      భార్య, కుమారుడి హత్య..ఉలిక్కిపడిన పహడీషరీఫ్
  •      భార్య సీమంతం ఏర్పాట్లలో అపశ్రుతి..గాలికి పట్టుతప్పి పడి భర్త దుర్మరణం
  •      చార్మినార్‌లో డీఆర్‌డీఓ ఆర్‌డీపై బ్లేడుతో దాడి
  •      రహమత్‌నగర్‌లో కానిస్టేబుళ్లపై దౌర్జన్యం
  •      గండిపేట జలాశయంలో ఇద్దరి గల్లంతు
  • పహడీషరీఫ్: తెలతెలవారుతూనే.. భార్య, కుమారుడిని భర్త హతమార్చాడనే వార్తతో పహడీషరీఫ్ ప్రాంతం ఉలిక్కిపడింది. హయత్‌నగర్ ప్రాంతంలో భార్య సీమంతానికి ఏర్పాట్లు చేస్తూ.. పెద్దగా వీచిన గాలికి అదుపుతప్పి పడిపోయి ఆమె భర్త దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. శుభకార్యం జగరాల్సిన ఆ ఇంట చావు బాజా మోగడం పలువురిని కలచివేసింది. ఆపై రహమత్‌నగర్‌లో జూబ్లీహిల్స్ కాని స్టేబుళ్లపై దాడి, చార్మినార్‌లో డీఆర్‌డీఓ రీజనల్ డెరైక్టర్ సత్యపతిపై బ్లేడుతో ఓ బాలుడు దాడి, గండిపేట జలాశయంలో ఇద్దరు యువకుల గల్లంతు ఘటనలు కలకలం రేపాయి.
     
    తల్లీకొడుకుల దారుణహత్య

    చిన్న విషయానికే గొడవపడిన ఓ వ్యక్తి కిరాతకుడయ్యాడు. కట్టుకున్న భార్యను, కన్న కుమారుడిని దారుణంగా హతమార్చాడు. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిం చాడు. పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన మినీందర్ (24)కు కర్ణాటకకు చెందిన స్వప్న (19)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సూరజ్ అనే పది నెలల కుమారుడు ఉన్నాడు. వీరు జల్‌పల్లి శ్రీరాం కాలనీలో ఉంటున్నారు. మినీందర్ స్థానిక ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నాడు.

    భార్యాభర్తలు శనివారం రాత్రి 8 గంటల సమయంలో గొడవ పడ్డారు. వీరి ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి అర్ధరాత్రి 12.30ప్రాంతంలో బయటకు రాగా, మినీందర్ ఇంట్లోంచి పొగలు రావడం కనిపించింది. ఆయన వెంటనే  స్థానికుల సాయంతో లోనికి వెళ్లి చూడగా స్వప్న మంటల్లో కాలి పడి ఉంది. పక్కనే ఆమె కుమారుడు సూరజ్ విగతజీవిగా కన్పించాడు. సూరజ్‌కు కాలిన గాయాలు లేవు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

    స్వప్నకు కొద్దిపాటి కాలిన గాయాలే ఉండడాన్ని గమనించిన పోలీసులు మరింత లోతుగా పరిశీలించగా ఆమె మెడకు చీరతో ఉరేసి హత్య చేసినట్టు ఆనవాళ్లు కన్పించాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరగడం.... భర్త పరారీలో ఉండడంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

    భార్యను చీరతో ఉరేసి హత్య చేసిన మినీందర్ నేరం తనపైకి రాకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement
 
Advertisement
 
Advertisement