ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం

Published Fri, Jul 14 2017 1:36 AM

ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం - Sakshi

పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న ఇళ్లపై దాడులు
సూర్యాపేట/నిజామాబాద్‌ అర్బన్‌/హైదరాబాద్‌:
ఏసీబీకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న, ఆయన బంధువుల నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

నాలుగు బృందాలుగా విడిపోయి సూర్యాపేట, నిజామాబాద్, హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్, మియాపూర్‌ మదీనగూడలోని కృషినగర్‌లో సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.2 కోట్లకు పైగా ఆస్తులు, లాకర్ల నుంచి 36 తులాల బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఇక్బాల్‌ సిద్దిఖీ హైదరాబాద్‌లో వెల్లడించారు. సూర్యాపేటలో ఉంటున్న వెంకన్న సోదరుడు లింగయ్య, ఆయన తండ్రి మల్లయ్య నివాసాలలో ఐదు ఫ్లాట్లు, సూర్యాపేట పరిధిలో ఏడు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన ఎనిమిది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ విలువ ప్రకారం వీటి విలువ రూ.16 లక్షలు ఉంటుందని తెలిపారు. వెంకన్న సోదరుడు లింగయ్య ప్రస్తుతం రూ.70 లక్షల వ్యయంతో ఇల్లు నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే.. నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న వెంకన్న మామ గడ్డం నారాయణ ఇంట్లో ఇప్పటి వరకు 25 ఎకరాల భూమికి సంబంధించి డాక్యుమెంట్లు, రెండు బ్యాంకు లాకర్లు స్వాధీనం చేసుకున్నట్లు అక్కడ సోదాలు నిర్వహించిన డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు. డిచ్‌పల్లిలోని 25 ఎకరాలలో 14 ఎకరాలు నారాయణ భార్య శీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారాణ చేసినట్లు చెప్పారు. మరిన్ని ఆదాయానికి మించి ఆస్తులపై విచారణ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement