'ఈ వ్యవహారం అత్యంత జుగుప్సకరమైనది' | Sakshi
Sakshi News home page

'ఈ వ్యవహారం అత్యంత జుగుప్సకరమైనది'

Published Wed, Jun 10 2015 4:45 PM

'ఈ వ్యవహారం అత్యంత జుగుప్సకరమైనది' - Sakshi

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు కీలక దశకు చేరిన ఈ సమయంలో ప్రధాన నిందితుడు  రేవంత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడం కుదరదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఓటుకు కోట్లు వ్యవహారం అత్యంత జుగుప్సకరమైనది, ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన కేసు అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటుకు కోట్లు కేసులో ఉన్న వారు బెయిల్‌కు అర్హులే కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.   రేవంత్‌కు బెయిల్‌ ఇస్తే  సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదముందన్న ఏసీబీ వాదనల్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. బెయిల్‌ కోసం రేవంత్‌ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును కోర్టు  తిరస్కరించింది.

అయితే కుమార్తె వివాహ నిశ్చితార్ధాన్ని పురస్కరించుకొని  12 గంటల పాటు తాత్కాలిక  బెయిల్‌ మంజూరు చేసింది. ఆ 12 గంటల బెయిల్‌ కూడా కోర్టు చాలా కఠినమైన షరతులు విధించింది.  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేవంత్‌ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. అయితే ఆ పన్నెండు గంటల పాటు వెంట కచ్చితంగా ఎస్కార్ట్ ఉండాల్సిందనే కోర్టు ఆదేశించింది.  మరో వైపు 12 గంటల బెయిల్‌ సమయంలో  రేవంత్‌ మీడియాతో మాట్లాడటం, రాజకీయ నాయకులతో చర్చించడం వంటి చేయకూడదని షరతు విధించింది.

కేవలం కుమార్తె నిశ్చితార్ధ కార్యక్రమంలో మాత్రమే పాల్గొనాలని బెయిల్‌ ఉత్తర్వుల్లో న్యాయస్థానం స్పష్టం చేసింది. కుమార్తె నిశ్చితార్థానికి హజరయ్యేందుకు కనీసం 48 గంటల పాటు బెయిల్‌ ఇవ్వాలని రేవంత్‌ తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఏసీబీ మాత్రం  మానవతా కోణంలో 24 గంటలపాటు  బెయిల్‌ ఇస్తే తమకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు, కేసు పురోగతి, ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి 12 గంటల మాత్రమే బెయిల్‌ మంజూరు చేశారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు జైలుకు వచ్చి లొంగిపోవాలని న్యాయస్థానం రేవంత్‌ రెడ్డిని ఆదేశించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయసింహా, సెబాస్టియన్ కూడా బెయిల్ కు అర్హులు కాదని పేర్కొంది.

Advertisement
Advertisement