రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ | Sakshi
Sakshi News home page

రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ

Published Sun, Jun 7 2015 2:43 AM

రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ - Sakshi

* ఓటుకు నోటు కేసులో కస్టడీలోకి తీసుకున్న అధికారులు
* మిగతా ఇద్దరు నిందితులనూ విడివిడిగా విచారణ
* వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక నేపథ్యాలపై ఆరా
* ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశ్నల పరంపర
* రేవంత్‌కు మాత్రం మధ్యాహ్నం 3 నుంచి ప్రశ్నలు
* కీలక సమాచారం రాబట్టేందుకు తొలిరోజు రిహార్సల్స్!

 
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన కేసులో పట్టుబడిన టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలపై ఏసీబీ శనివారం ప్రశ్నల వర్షం కురిపించింది. వారి వ్యక్తిగత సమాచారంతో పాటు కేసులో వారి పాత్రను బయటపెట్టేందుకు ప్రయత్నించింది. కోర్టు అనుమతితో నిందితులను 4 రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ తొలిరోజు విచారణలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
 
 వారి నుంచి వాస్తవాలు రాబట్టేందుకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే తయారుచేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకే తొలిరోజు దర్యాప్తు అధికారులు ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతూ నిందితులను అయోమయానికి గురిచేసేలా వ్యవహరించినట్లు తెలిసింది. విచారణ సమయంలో నిందితుల తరఫు న్యాయవాదులు అక్కడే ఉండే ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ అశోక్‌కుమార్, మరో ఇద్దరు సీఐల సమక్షంలో రేవంత్ విచారణ సాగగా, మిగతా ఇద్దరిని కూడా విడివిడిగా ముగ్గురేసి అధికారులు ప్రశ్నించారు.
 
 రేవంత్ విచారణ రెండు గంటలే!
 ఉదయం 9.15 గంటలకు చర్లపల్లి జైలుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు నాటకీయ పరిణామాల నడుమ మీడియా కళ్లు కప్పి తొలుత సెబాస్టియన్, ఉదయ్ సింహలను మాత్రమే ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇద్దరు నిందితులను విడివిడిగా ప్రశ్నించారు. కాగా, వైద్య పరీక్షల కోసమని మధ్యాహ్నం 1.30 గంటల వరకు రేవంత్‌ను జైలులోనే ఉంచారు. తర్వాత ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి మధ్యాహ్న భోజనాల అనంతరం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రేవంత్‌ను విచారించినట్లు సమాచారం.
 
 కాగా, ఏసీబీ అధికారులు ‘మైండ్ గేమ్’కు దిగినట్లు నిందితుల తరఫు లాయర్ల మాటలను బట్టి అర్థమవుతోంది. రేవంత్‌ను వ్యక్తిగత విషయాలు, రాజకీయ జీవితంలో ఆటుపోట్లు, వ్యాపారాలు, రాజకీయ ప్రస్థానం.. కాంగ్రెస్ సీనియర్లు జైపాల్‌రెడ్డి, జానారెడ్డితో ఉన్న బంధుత్వం, ప్రేమ వివాహం, తదనంతర  పరిణామాలు, ‘బాస్’ చంద్రబాబుతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. వీడియో ఫుటేజీల్లో ఆయన మాటలను మరోసారి అధికారికంగా నిర్ధారించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు ఇవ్వజూపడాన్ని కూడా రేవంత్ ముందు అధికారులు ప్రస్తావించారు.
 
 సెబాస్టియన్, ఉదయ్‌లపై దృష్టి
 ఈ కేసులో ఏ2, ఏ3గా ఉన్న సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహను ముగ్గురేసి అధికారులు విచారించారు. ఒక్కొక్కరిని కనీసం 40 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ బంధువు నివాసానికి ముందుగా రేవంత్, సెబాస్టియన్ వెళ్లగా... తర్వాత ఉదయ్ సింహ రూ. 50లక్షలతో కూడిన బ్యాగును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతపెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఉదయ్‌ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే ఈ వ్యవహారంలో రేవంత్, చంద్రబాబుల పాత్రపై సెబాస్టియన్‌ను అడిగినట్లు సమాచారం. కాగా, విచారణ అనంతరం నిందితులను చర్లపల్లి జైలుకు తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో వారిని బషీర్‌బాగ్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి బస అక్కడే. ఆదివారం ఉదయం 9 గంటలకు నిందితులను మళ్లీ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించనున్నారు.

Advertisement
Advertisement