జెడ్పీ కా ‘రాణి’ | Sakshi
Sakshi News home page

జెడ్పీ కా ‘రాణి’

Published Sun, Jul 6 2014 2:32 AM

జెడ్పీ కా ‘రాణి’

- జెడ్పీపై ఎగిరిన గులాబీ జెండా  
- చైర్‌పర్సన్‌గా వల్లకొండ శోభారాణి
- వైస్‌ చైర్మన్‌గా మూల రాజిరెడ్డి  
- మూడేళ్ల తర్వాత ఎన్నిక..

సాక్షి,ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నిర్మల్ జెడ్పీటీసీ వల్లకొండ శోభారాణి ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా చెన్నూరు జెడ్పీటీసీ మూల రాజిరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కోసం శనివారం జెడ్పీ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు జెడ్పీటీసీలు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్‌గా శోభారాణి పేరును గుడిహత్నూర్ జెడ్పీటీసీ కేశవ్‌గిత్తే ప్రతిపాదించగా, ఆదిలాబాద్ జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్ బలపరిచారు.

ఈ పదవికి ఎవరూ పోటీలో లేకపోవడంతో శోభారాణి  చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ జగన్మోహన్ ప్రకటించారు. అలాగే వైస్‌చైర్మన్‌గా మూల రాజిరెడ్డి పేరును మందమర్రి జెడ్పీటీసీ కె.సుదర్శన్ ప్రతిపాదించగా, కౌటాల జెడ్పీటీసీ డుబ్బుల నానయ్య (బీఎస్పీ నుంచి పోటీచేసి గెలిచారు) బలపరిచారు. ఈ పదవికి కూడా ఎవరూ పోటీలో లేకపోవడంతో వైస్‌చైర్మన్‌గా రాజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో 52 స్థానాలకు గాను 38 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్ జిల్లా పరిషత్ చరిత్రలోనే మొదటి సారిగా జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేశారు.
 
కో ఆప్షన్ సభ్యులూ ఏకగ్రీవమే..
జెడ్పీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగింది. చెన్నూరుకు చెందిన సయ్యద్ సాదిఖ్ అలీ, ఖానాపూర్‌కు చెందిన యూసుఫ్ అహ్మద్ ఖాన్‌లు ఎన్నికయ్యారు. ఈ రెండు కోఆప్షన్ పదవులకు ఐదుగురు నామినేషన్లు వేశారు. ఈ ఇద్దరితో పాటు ఇంద్రవెల్లికి చెందిన ఎం.డి.అంజద్, ఖానాపూర్‌కు చెందిన రఫీక్ బేగ్, ఎండీ జహీరుద్దీన్‌లు నామినేషన్లు వేశారు. ఇందులో అంజద్, రఫీక్ బేగ్‌ల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, జహీరుద్దీన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న సాదిఖ్ అలీ, యూసుఫ్ అహ్మద్‌ఖాన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు.
 
ఎన్నిక జరిగింది ఇలా..

శనివారం ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్ సభ్యుల పదవులకు నామినేషన్లు తీసుకున్నారు. ఈ నామినేషన్లను పరిశీలించిన అనంతరం ముగ్గురు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మొదట జెడ్పీటీసీలతో జెడ్పీ సీఈఓ అనితాగ్రేస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. తిరిగి మూడు గంటలకు సమావేశం ప్రారంభం కాగా మొదట చైర్‌పర్సన్‌ను, తర్వాత వైస్‌చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరింది.
 
బాధ్యతలు స్వీకరించిన జెడ్పీ చైర్మన్
జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం శోభారాణితో సీఈఓ అనితాగ్రేస్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయించారు. శోభారాణి జెడ్పీటీసీగా ఒకసారి, చైర్‌పర్సన్‌గా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఘనంగా సన్మించారు. సమావేశం ముగిసిన తర్వాత శోభారాణి నేరుగా తన చాంబర్‌లోకి వెళ్లి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
 
చివరి వరకూ కొనసాగిన ఉత్కంఠ
చైర్‌పర్సన్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. శోభారాణితో పాటు, మంచిర్యాల జెడ్పీటీసీ ఆశలత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఎట్టకేలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శోభారాణి పేరు ఖరారైంది. కాగా మంత్రి జోగురామన్న, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు జెడ్పీటీసీలతో కలిసి బాసరలో క్యాంపులో ప్రత్యేక సమావేశమై.. ఎన్నిక విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
 
హాజరైన ప్రజాప్రతినిధులు
జిల్లా పరిషత్ తొలి సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులతో పాటు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోనేరు కోనప్ప (సిర్పూర్), నల్లాల ఓదేలు (చెన్నూరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్), జి.విఠల్‌రెడ్డి (ముథోల్), కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), రాథోడ్ బాపురావు (బోథ్)లు హాజరయ్యారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కరీంనగర్ జెడ్పీ సమావేశానికి వెళ్లడంతో ఇక్కడి సమావేశానికి రాలేకపోయినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు.
 
పార్టీ కార్యక్రమంలా ముగిసిన తొలి సమావేశం..
జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ తొలి సమావేశం చివరకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల అభినందన సభగా ముగిసింది. చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ప్రమాణ స్వీకారం అనంతరం వీరిని సన్మానించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సమావేశం వేదిక ముందున్న ఎంపీ, ఎమ్మెల్యేలను కలెక్టర్ జగన్మోహన్ వేదికపైకి ఆహ్వానించి, సమావేశం నుంచి నిష్ర్కమించారు.

ఆ తర్వాత జెడ్పీ ప్రత్యేక సమావేశం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సాగింది. పార్టీ అభినందన సభలా తయారైంది. కేవలం అర్హత కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికపైన కూర్చునే నిబంధనలు ఉండగా, ఆ పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. జెడ్పీటీసీల కుర్చీల్లో పార్టీ కార్యకర్తలు ఆసీనులయ్యారు. మరోవైపు టీఆర్‌ఎస్ శ్రేణులు సమావేశం హాలులోకి చొచ్చుకు వచ్చారు. తమ నాయకున్ని వేదికపైకి పిలవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చైర్‌పర్సన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశం కాస్త పార్టీ కార్యక్రమంలా ముగియడం అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement