కాంగ్రెస్‌లో టిక్కెట్ల లొల్లి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో టిక్కెట్ల లొల్లి

Published Sat, Mar 15 2014 2:42 AM

Agitation for congress Tickets

కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ టికెట్ల లొల్లి ముదిరింది. టిక్కెట్లు కేటాయించే విషయంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ మధ్య గొడవ మొదలైంది. తన అనుచరుల పేర్లతో ఎంపీ ఓ జాబితా సిద్ధం     చేయగా.. ఏకపక్షంగా ఎలా చేస్తారని సంతోష్‌కుమార్ ఫైర్ అయ్యారు.  పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో  శుక్రవారం వీరిద్దరి మధ్య రగడ జరిగింది.
 
 కరీంనగర్‌సిటీ, న్యూస్‌లైన్ : నగరంలోని 50 డివిజన్లకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పీసీసీ పరిశీలకుడు శ్రీరాంభద్రయ్య.. అభ్యర్థుల ఎంపిక కోసం రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీమంత్రి శ్రీధర్‌బాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక జాబితాకు తుది రూపం ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా తాను రూపొందించిన జాబితాను అందించారు. అందులో శ్రీధర్‌బాబు అనుచరవర్గంగా గుర్తింపు పొందిన వి.అంజన్‌కుమార్, ఆమ ఆనంద్, ఇమ్రాన్, ఆకుల రాము వంటి వారి పేర్లు లేకపోవడంతో గొడవ మొదలైంది.
 
 అక్కడే ఉన్న ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ తన స్వభావానికి భిన్నంగా ఎంపీ వైఖరిపై విరుచుకుపడడంతో అక్కడున్న నాయకులంతా అవాక్కయినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న అంజన్‌కుమార్, ఇమ్రాన్, ఆమ ఆనంద్, రాము తదితరుల అభ్యర్థిత్వాన్ని ఎంపీ కావాలనే తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ ఇచ్చిన జాబితాను ప్రకటిస్తే ఆ మరుక్షణమే మీడియా సమావేశంలో ఎండగడుతానని శ్రీధర్‌బాబును హెచ్చరిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
 
 గొడవకు కారణమిది..
 నగరంలోని 3వ డివిజన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ సతీమణి శ్రీదేవి పార్టీ తరఫున నామినేషన్ వేశారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అర్ష మల్లేశం సతీమణి, మాజీ కౌన్సిలర్ కిరణ్మయి (బీసీ) కూడా పార్టీ నుంచే నామినేషన్ దాఖలు చేశారు.
 
 శ్రీదేవికి బదులు కిరణ్మయికి.. 19వ డివిజన్ నుంచి ఇమ్రాన్ టికెట్ ఆశిస్తున్నా.. చింతల కిషన్ వైపు, 32వ డివిజన్ నుంచి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్ టికెట్ ఆశిస్తున్నా.. పొన్నం శ్రీనివాస్‌కు.. 38వ డివిజన్ నుంచి ఆకుల రాము భార్య శిల్ప టికెట్ అడుగుతున్నా.. ఎంపీ పొన్నం మాత్రం సునీల్ కుటుంబంవైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అంజన్‌కుమార్, ఆమ ఆనంద్, ఇమ్రాన్, ఆకుల రాము ఇటీవలి కాలంలో శ్రీధర్‌బాబుకు ముఖ్యఅనుచరగణంగా ముద్రపడడం గమనార్హం.
 

Advertisement
Advertisement