పెథాయ్‌ బెంగ | Sakshi
Sakshi News home page

పెథాయ్‌ బెంగ

Published Sat, Dec 15 2018 8:53 AM

Agriculture Officers Warns To Farmers - Sakshi

ఖమ్మం, వ్యవసాయం: ‘పెథాయ్‌’ తుపాను నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేతికందే దశలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన వివిధ రకాల పంటలపై తుపాను ప్రభావం ఉంటుందేమోనన్న గుబులు రైతుల్లో రేకెత్తుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు వరంగల్‌ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చూస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వాతావరణ శాఖ కూడా ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని ఈదురు గాలులు వీస్తున్నాయి.

జిల్లాకు సరిహద్దులో ఉన్న మహబూబాబాద్, బయ్యారంలో శుక్రవారం వర్షం కురిసింది. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు చేసిన వివిధ రకాల పంటలు చేతికందే దశలో ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో ప్రధానంగా సాగు చేస్తున్న వరి పంటను కోస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పంటను కోసి ధాన్యాన్ని తయారు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కొందరు రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎటువంటి రక్షణ లేదు. వర్షం వస్తే కేంద్రాల్లో రాశులుగా పోసిన ధాన్యం తడిసే పరిస్థితి నెలకొంది. వరి పండించిన ప్రాంతాల్లో ఎటువంటి షెడ్లు, గోదాములు లేని ఆరుబయట ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10 రోజలుగా రైతులు వరికోతలు, విక్రయాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోకి నీరు చేరటంతో ఖరీఫ్‌లో సాధారణానికి మించి వరిని సాగు చేశారు. ఈ జిల్లాలో సుమారు 1.75 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కూడా వివిధ జలాశయాలు, ప్రాజెక్టుల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ పంట మొత్తం కూడా కోత, కల్లాల్లో ఆరబోసి, కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంది.

ఇక ఉమ్మడి జిల్లాల్లో మరో ప్రధాన పంట పత్తి. ఈ పంట రెండో తీత దశలో ఉంది. అక్కడక్కడ రైతులు పత్తి తీసే పనిలో ఉన్నారు. ఈ పంటను కూడా రెండు జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరో ప్రధాన పంట మిర్చి. ఈ పంట తొలికోత సాగుతోంది. ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 70 వేల ఎకరాల్లో మిర్చిని సాగు చేస్తున్నారు. తుఫాను ప్రభావం ఈ మూడు రకాల పంటలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు సరిహద్దుగా ఉన్న కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కేంద్రంగా తుపాను ప్రభావం కోస్తాంద్రలో బాగా ఉంది. ఇటీవల ఏర్పడిన తత్లీ తుపాను మాదిరిగానే ప్రస్తుతం ఏర్పడిన తుపాను ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తత్లీ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లాలో తీరని నష్టం వాటిల్లింది. 

వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు
∙వరి కోత దశలో ఉంది. ఈ కోతలను నిలుపు చేయాలి. కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులపై, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రాశులపై టార్పాలిన్‌లను కప్పి రక్షణ కల్పించాలి.
∙రెండు మూడు రోజుల పాటు వర్షం కురిస్తే తీతదశలో ఉన్న పత్తికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దూదిలో ఉన్న గింజ మొలకెత్తే అవకాశం ఉంది. దీంతో దూది పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది.  
∙మిర్చి కూడా తొలి కోతలో ఉంది. ఈ పంటకు కాయకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది. 
∙కంది కూడా కోత దశలో ఉంది. ఈ పంటపై కూడా వర్షం ప్రభావం ఉంటుంది. ఈ పంట కోతను కూడా నిలిపివేయాలి.

మూడు రోజులపాటు ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుపాను ప్రభావం 16,17,18 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంలో తుపాను కారణంగా ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ తుపాను ప్రభావం ఉంది. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి.
- బాలాజీ నాయక్, సీనియర్‌ సైంటిస్ట్, వ్యవసాయ, వాతావరణ పరిశోధన కేంద్రం, హైదరాబాద్‌

Advertisement
Advertisement