కార్పొరేషన్ ‘హస్త’గతమెలా... | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ ‘హస్త’గతమెలా...

Published Mon, Aug 25 2014 2:18 AM

AICC leaders discussion with district representatives in medho madanam

ఖమ్మం: జిల్లాలో కీలకమైన ఖమ్మం కార్పొరేషన్ ఎలా ‘హస్త’గతం చేసుకోవాలన్న అంశంపై, పట్టణ ప్రాంతాల్లో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా నాయకులతో ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు ఆదివారం హైదరాబాదులో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆదివారం హైదరాబాద్‌లో మేథోమధనం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ సెక్రటరీ రామచంద్ర కుంధియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యుడు కొప్పుల రాజు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇన్‌చార్జీలు శీలంశెట్టి వీరభద్రం, ఐతం సత్యం, శ్రీనివాస్‌రెడ్డి,వీవీ అప్పారావు, పరుచూరి మురళి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు.

 పార్టీ రాష్ట్ర వ్యవహారాలు, వివిధ రంగాల ప్రజలు, సామాజిక వర్గాల వారు పార్టీకి ఎందుకు దూరమయ్యారు...? వారిని ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి..? తదితరాంశాలపై ఈ సమావేశం చర్చించింది. త్వరలో ఎన్నికలు జరిగే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం  కార్పొరేషన్లలో గెలుపుఐ చర్చించింది. నలుగురు ఎమ్మెల్యేలు కమిటీగా ఏర్పడి, కార్పేరేషన్ ‘చెయ్యి’ జారకుండా చూడాలని అధిష్టానం చెప్పినట్టు తెలిసింది.

జిల్లా నాయకులు మాట్లాడుతూ... గత నాలుగు నెలలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొన్నేళ్లుగా నగర అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది. ఏఐసీసీ సభ్యులు సమాధానమిస్తూ.. సెప్టెంబర్ మొదటి వారంలో రామచంద్ర కుంధియాను జిల్లాకు పంపిస్తామని, ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెప్పినట్టు సమాచారం. జిల్లాకు సంబంధించిన అనేక విషయాలపై నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement