అంతా సిద్ధం | Sakshi
Sakshi News home page

అంతా సిద్ధం

Published Sun, Aug 17 2014 11:43 PM

అంతా సిద్ధం - Sakshi

సాక్షి, కరీంనగర్ : సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులాలు, ఆర్థిక, సామాజిక, సమగ్ర జనాభా లెక్కింపు సమాచార సేకరణ కోసం ఈ నెల 19న చేపట్టిన ఇంటింటి సర్వేను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేసిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాలను కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా ఎస్పీ శివకుమార్ ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరించారు. నియోజకవర్గానికి, మండలానికి ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులను నియమించామని, సందేహాలుంటే వారిని సంప్రదించాలని సూచించారు.
 
అందరూ ఇళ్లలోనే ఉండి సమాచారం కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో సమగ్ర సమాచారం ఇవ్వాలన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 30 కుటుంబాల సర్వే బాధ్యతలిచ్చామని పేర్కొన్నారు. ఎ న్యూమరేటర్లు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని, వారికి అక్కడ ఒక రోజు ముందే సర్వే ఫారాలు అందజేస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు ఎన్యూమరేటర్లు తాము సర్వే నిర్వహించే ప్రాంతాల్లో పర్యటించి.. మరుసటి రోజు ఉద యం 7 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు సర్వే పూర్తి చేయాలన్నారు.
 
ప్రజలు చెప్పిందే రాసుకోకుండా.. ఇల్లు, పరిసర పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని వాస్తవ వివరాలు నమోదు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. పూర్తి చేసిన సర్వే ఫారాలు సంబంధిత, గ్రామ పంచాయతీ, తహశీల్దార్ కార్యాలయాల్లో అప్పజెప్పాలన్నారు. సర్వే సమాచారాన్ని 20 నుంచి 26వ తేదీ వరకు కంప్యూటరీకరిస్తామని చెప్పారు. ఇం దుకోసం జిల్లావ్యాప్తంగా 3 వేల కంప్యూటర్లు.. అంతే మంది ఆపరేటర్లను నియమించినట్లు వివరించారు.
 
సర్వే సిబ్బంది ని తరలించేందుకు.. 200 ఆర్టీసీ, 446 ప్రైవేట్ మినీ బస్సులు, 569 జీపులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శివకుమార్ చెప్పారు. 3500 మంది పోలీసు సి బ్బంది ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని, పెట్రోలింగ్ కోసం 200 మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
 
టోల్‌ఫ్రీ
సర్వేపై సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్ 18004254731 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిరంతరం ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏ అనుమానమున్నా ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
 
వాస్తవాలే చెప్పండి
*సిబ్బందికి వాస్తవాలే చెప్పాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకే సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఒకే పొయ్యి మీద వండుకున్నా.. వారిని ఒకే కుటుంబంగా గుర్తిస్తామన్నారు.
* ఇంటికి నోషనల్ నంబర్ కేటాయింపు సమయంలో అందుబాటులో లేనివారు ప్రస్తుతం ఇంట్లో ఉంటే వారికీ నోషనల్ నంబర్ కేటాయించి, వివరాలు సేకరిస్తారు.
* గుడిసెలకూ నోషనల్ నంబర్లు కేటాయించనున్నారు.
 
సర్వం బంద్
సర్వే రోజు సర్వం బంద్ కానుంది. సిబ్బంది కోసం అందుబాటులో ఉంచిన బస్సులు, ప్రైవేట్ వాహనాలు మినహా ఏ వాహనాలూ రోడ్లపై తిరగవు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవే ట్ కార్యాలయాలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ఫ్యాక్టరీలన్నీ మూతబడనున్నాయి. ప్రభుత్వం సెలవు ప్రకటిం చడంతో ఇప్పటికే సంబంధిత శాఖాధికారులు ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు ఎవరైనా ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement