ఆఫీసులన్నీ ఒకేచోట..! | Sakshi
Sakshi News home page

ఆఫీసులన్నీ ఒకేచోట..!

Published Tue, Jan 6 2015 5:04 AM

ఆఫీసులన్నీ ఒకేచోట..! - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలనను వేగవంతం చేసేందుకు.. ప్రజలకు జవాబుదారిగా ఉండేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోటకు తేనుంది. అన్ని జిల్లా  కార్యాలయాలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్ ఇలంబరితిని ఆదేశించారు. డివిజన్, మండలస్థాయిలో సైతం కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

జిల్లాలో ఇప్పటి వరకు పలు ప్రభుత్వశాఖలకు సొంతభనాలు లేవు. అద్దె భవానాల్లో చాలీచాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ భూముల గుర్తింపు, ప్రభుత్వ శాఖలకు చెందిన అద్దె భవనాల వివరాలు సేకరిస్తున్నారు.
 
పరిశీలనలో ఎన్నెస్పీ క్యాంప్..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా భూములు గుర్తించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియోకాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్ లో 35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కలెక్టర్ ఇలంబరితి వెల్లడించారు. జిల్లాస్థాయి కార్యాలయా ల సముదాయం నిర్మించడానికి ఇదే అనువైన స్థల మని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు కార్యాల యాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించింది. అన్నిటికీ అనువుగా ఉన్న ఎన్నెస్పీ క్యాంప్ లో అన్ని కార్యాలయాలు నిర్మించాలని మంత్రి తుమ్మల అధికారులతో చ ర్చించినట్లు తెలుస్తోంది.
 
అద్దె భారం...
జిల్లాలో పలు ప్రభుత్వశాఖలు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడిచినా ప్రధాన శాఖలకు మాత్రం సొంత కార్యాలయాలు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వశాఖల అభివృద్ధికి లక్షల కోట్లు విడుదల చేస్తున్నా అధికారులు మాత్రం కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు.  ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో కొంత అద్దెలకు వెచ్చిస్తూ విధులు నిర్వహించడం పరిపాటిగా మారింది.
 
అద్దె భవనాల్లో..
స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సొంత భవనం లేక అనేక ఏళ్ళుగా కలెక్టరేట్ వెనుక భాగంలో అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. దీని కిరాయి నెలకు రూ.30వేలు.
పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయం సైతం అద్దె భవనంలోనే ఉంది.
ఉద్యానశాఖ 1, 2 విభాగాలు స్థానిక వీడివోస్ కాలనీలో అద్దెభవనాల్లోనే నిర్వహిస్తున్నారు.
⇒  మైనింగ్ ఏడీ కార్యాలయం కూడా ఇక్కడే అద్దెభవనంలోనే కొనసాగుతోంది.
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి సైతం సొంత భవనం లేదు. ఖానాపురం హవేలి పంచాయతీ కార్పొరేషన్‌లో విలీనం కావడంతో ఆ భవనాన్ని పంచాయతీ అధికారి కార్యాలయానికి అప్పగించారు. అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయానికీ సొంత భవనం లేదు. ప్రస్తుతం జిల్లా పరిషత్ భవనంలో ఒక గదిలో ఇది కొనసాగుతోంది.
జిల్లా అడిట్ కార్యాలయం ఒక విభాగం కిరాయి చెల్లిస్తుండగా, మరో విభాగం జిల్లా పరిషత్ భవనంలో ఉంది.
కమర్షియల్ ట్యాక్స్  1, 2, 3, విభాగాలను వేల రూపాయలు చెల్లిస్తూ కాల్వొడ్డులోని అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు.
జిల్లా పర్యాటకశాఖకూ సొంత భవనం లేదు. గతంలో కలెక్టరేట్‌లో ఒక గదిలో ఉండేది. తరువాత అక్కడి నుంచి జిల్లా పరిషత్‌లోని ఓ గదికి మార్చారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రధాన కార్యాలయానికీ సొంత భవనం లేదు.
జిల్లా ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం అద్దె భవనంలోనే ఉంది.
ఇరిగేషన్ ఎత్తి పోతల పథకం కార్యాలయం కిరాయి భవనమే.
కార్మికశాఖ కార్యాలయం లేక పోవడంతో అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు.
నెడ్ క్యాప్ ఏపీఎంఐపీ, ఆత్మ తదితర కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement