ఆకర్ష్ గులాబీ..! | Sakshi
Sakshi News home page

ఆకర్ష్ గులాబీ..!

Published Tue, Jul 8 2014 3:32 AM

ఆకర్ష్ గులాబీ..! - Sakshi

- టీఆర్‌ఎస్ గూటికి మరికొంతమంది
- మొగ్గుచూపుతున్న ఓ మున్సిపల్ చైర్మన్
- అదేబాటలో 9మంది కాంగ్రెస్,
- టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అధికార పార్టీవైపు
- కొందరు ఎంపీపీల చూపు
- ప్రత్యర్థులకు చుక్కలు చూపేందుకు గులాబీదళ వ్యూహం

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందునుంచి ప్రారంభమైన రాజకీయ వలసలు.. ఎంపీపీ, జెడ్పీ, మున్సిపల్ పాలకమండళ్ల ఏర్పాటు సమయంలో తీవ్రరూపం దాల్చాయి. వాటి ఎన్నిక ప్రక్రియ పూర్తయినా.. పార్టీ ఫిరాయింపులు ఇంతటితో ముగిసేలా లేవు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న గులాబీ పార్టీలో చేరేందుకు పలువురు ప్రజాప్రతినిధులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 9మంది జెడ్పీటీసీ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు.

కొందరు ఎంపీపీలు సైతం అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని భావించిన ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రలోభాల ఎర చూపడం.. లేదంటే ఇదివరకు ఎంపీపీ, జెడ్పీటీసీ పదువులు అనుభవించిన వారు చేపట్టిన పనులను నిధులు మంజూరు చేసేందుకు తాత్కాలికంగా కొర్రీ విధించడం.. పనులను నాణ్యతను చూశాకే.. మంజూరు చేస్తామని చెబుతూ ఇతర పార్టీలకు చెందిన వారిని గులాబీవైపు మళ్లించేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఒక్కొక్కరిగా కాకుండా అందరినీ ఒకే వేదికమీద కండువాలను కప్పి తమ పార్టీలో చేరేందుకు సందర్భంకోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించడమే కాకుండా.. గులాబీ పార్టీ ప్రతిష్టను కూడా చాటుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్ర రాజకీయ కూటములతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకీ సరిపడినంత సంఖ్యాబలం లేని చోట ప్రలోభాల పర్వం జోరుగా సాగింది.

క్యాంపుల పేరిట తమ సభ్యులు చేజారకుండా పార్టీలు, నేతలు కట్టుదిట్టంగా వ్యవహరించినా పలుచోట్ల ఫిరాయింపులు జరిగాయి. పార్టీలు, సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంతో ‘కలగూర గంప’ కూటములకు మండల పరిషత్ పీఠాలు దక్కాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ మెజారిటీ మండల పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది.
 
వ్యూహాత్మక ఎన్నిక..!
జెడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసిన టీఆర్‌ఎస్ పార్టీ ముందస్తుగా ఇతర పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్ జిల్లా పరిషత్ ైచైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ విప్ ఉల్లంఘించి టీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కొత్తూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డికి వైస్ చైర్మన్ పదవి దక్కింది.

64మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో  చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికయ్యేందుకు కనీసం 33మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా.. టీఆర్‌ఎస్‌కు చెందిన 25మంది సభ్యులతో పాటు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సహకరించడంతో సంఖ్యాబలం 35కు చేరింది. దీంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోగలిగారు. 64 మండల పరిషత్‌లకు గాను 62 మండలాలకు సంబంధించి ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి 27చోట్ల ఎంపీపీ అధ్యక్ష పదవులు, 20 ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది.

Advertisement
Advertisement