కోటాలో కోత వద్దు | Sakshi
Sakshi News home page

కోటాలో కోత వద్దు

Published Sat, Jul 11 2015 4:06 AM

కోటాలో కోత వద్దు - Sakshi

- అర్హులందరికీ రేషన్ ఇవ్వాలి    
- గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశ తీర్మానం
ఇందూరు:
కుటుంబంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ అందేలా చూడాలని, ఇక ముందు కోటాలో కోత లేకుండా సరఫరా చేయాలని కోరుతూ గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశం తీర్మానించింది. గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశం శుక్రవారం జిల్లాపరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షతన జరిగింది. డీఆర్‌డీఏ, ఐకేపీ, పరిశ్రమలు, హౌసింగ్, సహకార, నెడ్‌క్యాప్, సివిల్ సప్లయ్, స్టెప్, ఆర్టీసీ, గనులు, భూగర్భ, డ్వామా శాఖలు చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై చర్చించింది. పలువురు సభ్యులు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
రేషన్ అక్రమాలు
రేషన్ డీలర్ల అక్రమాలను సభ్యులు ప్రస్తావించారు. కుటుంబ సభ్యులందరికీ ఒక నెల రేషన్ కోటా వస్తే.. తదుపరి నెలలొ ఒకరిద్దరికి డీలర్లు కోత పెడుతున్నారని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్‌ఓ)తో సభ్యులు చెప్పారు. ఆధార్ అనుసంధానం కాలేదని డీలర్ చెప్పడంతో ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రేషన్ కోటా వచ్చినప్పటికీ రాలేదని కొందరు డీలర్లు చెబుతున్నారని, సరుకులను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేశారు. షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో దాడులు చేయిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. అంత్యోదయ కార్డులు డీలర్ల వద్దనే ఉన్నాయని అన్నారు. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమావేశం తీర్మానించింది.
 
జీవన భృతి చెల్లింపులో కూడా...

బీడీ కార్మికులకు జీవన భృతిపై ఈ సమావేశం చర్చించింది. భృతి చెల్లింపులోనూ అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి జాబితాలో పేరుండి, రెండవ జాబితాలో లేకపోవడంతో బీడీ కార్మికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బీడీ భృతి చెల్లింపులోనూ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై సోషల్ ఆడిట్ చేయించాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. నందిపేట్, నవీపేట్, వర్ని ప్రాంతాల్లోని జోగినులకు భృతి వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరో తీర్మాం చేసింది.
 
బ్యాంకర్లతో ఇబ్బందులు
నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చే విషయంలో అనుమతుల పేరిట బ్యాంకర్లు ఇబ్బందులపాలు చేస్తున్నారని సభ్యులు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సభ్యులు కోరారు.
 
హరితహారం గుంతలపై...

హరితహారం కార్యక్రమంపై కూడా ఈ సమావేశం చర్చించింది. పక్క పక్కనే  గుంతలు తీసి మొక్కలు నాటుతున్నారని, అవి ఎలా ఎదుగుతాయని డ్వామా పీడీని సభ్యులు ప్రశ్నించారు. హరితహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాలను ఏర్పాటు చేయూలని కోరారు.
ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్థిక స్థాయూసంఘం సమావేశం జరిగింది. జడ్పీ సీఈఓ మోహన్‌లాల్, జడ్పీటీసీ సభ్యులు తానాజీ రావు, మాధవ రావు దేశాయి, స్వాతి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement