అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.. | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..

Published Mon, Dec 1 2014 1:56 AM

All the fields will be developed

వినాయక్‌నగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ మలి ఉద్యమానికి దశ,దిశా నిర్ధేశించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాగా, తొలి అమరుడు శ్రీకాంత్‌చారి కావడం మన విశ్వబ్రాహ్మణులకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ మైదానంలో విశ్వబ్రాహ్మణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాలజ్ఞాని బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదన్నారు. జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను పరిష్కరిస్తూ, మరికొన్ని దీర్ఘకాలిక సమస్యలపై సీఎంతో చర్చించి పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

కాలజ్ఞానం నిజమవుతోంది: మంత్రి పోచారం
అనంతరం జిల్లా మంత్రి పోచారం మాట్లాడుతూ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎప్పటి కప్పుడు  నిజం అవుతోందన్నారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తారని చెప్పారని, ఈ రోజు నీళ్లతోనే కరెంట్ తయారవుతోందన్నారు.నీళ్ల కోసం పోరాటాలు జరుగుతాయని చెప్పారని, ప్రస్తుతం రెండు రాష్ట్రాలు నీళ్ల కోసమే పోరాడుతున్నాయన్నారు.  విశ్వబ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.  అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ.. తన ఎమ్మెల్యే నిధుల నుంచి విశ్వబ్రాహ్మణులకు సహాయం అందిస్తానని అన్నారు.
 
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘం జిల్లా అధ్యక్షుడు  దోసపల్లి నరహరి  మాట్లాడుతూ.. రూ. వెయ్యికోట్ల మూలధనంతో విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. బ్యాంకులో బంగారం నిర్ధారణ కోసం వాడుకునే తమను బ్యాంకు ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పోలీసుల వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాలయాల్లో అర్చకులుగా తమకు అవకాశం కల్పించాలన్నారు. మహిళా కమిషన్‌లో తమ మహిళలకు సభ్యులుగా స్థానం కల్పించాల ని పలు డిమాండ్లతో కూడిన నివేదికను స్పీకర్‌కు సమర్పించారు.  కార్యక్రమంలో నగరమేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ వీజీగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నగర ప్రతినిధులు పాల్గొన్నారు.

ఖిల్లా డిచ్‌పల్లిలో స్పీకర్
ఖిల్లా డిచ్‌పల్లి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని స్పీక ర్ సందర్శించారు. తన స్నేహితుడు  కరాటే మాస్టర్ వడియాల రవికుమార్‌తో కలిసి ధర్మారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

నేడు ఆర్మూర్‌లో స్పీకర్ పర్యటన
ఆర్మూర్ : అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సోమవారం ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  ఉదయం 8 గంటలకు పట్టణంలోని సిద్దుల గుట్టను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇటీవల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈ గుట్టపై వీర బ్రహ్మేంద్ర స్వామి మందిర నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన సందర్భంగా మందిర ప్రతిపాదిత స్థలాన్ని స్పీకర్ పరిశీలించనున్నారు. అనంతం ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఎంఆర్ గార్డెన్స్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో స్పీకర్  ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement