‘ఆన్‌లైన్’లోనే..అన్నీ | Sakshi
Sakshi News home page

‘ఆన్‌లైన్’లోనే..అన్నీ

Published Sat, Jun 21 2014 3:14 AM

‘ఆన్‌లైన్’లోనే..అన్నీ

320 పంచాయతీల్లో ‘ఈ పంచాయతీ’ సేవలు
ప్రస్తుతం తొమ్మిది చోట్ల అందుబాటులో
తొలి విడతలో176 మంది ఆపరేటర్లు
ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యత
 

నగరాలు, పట్టణాల్లో చాలా సేవలు ‘ఆన్‌లైన్లో’నే అందుతుంటాయి. ఇంట్లోనే నెట్ ఉంటే కాలు కదపాల్సిన పనే లేదు. ఇప్పుడు పల్లెల్లో కూడా ‘ఈ సేవలు’ అందించాలని, గ్రామీణు ముంగిటకే అన్ని ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలైతే పల్లెల్లో ఉండేవారికి జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం, వివిధ రకాల పన్నులను చెల్లింపు సునాయాసంగా చేసుకునే అవకాశం దక్కుతుంది. సాంకేతికత లోగిళ్ల వద్దకే చేరినట్టవుతోంది.
 
మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీలను ‘ఈ పంచాయతీ’లుగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. కనీసం నాలుగో వంతు పంచాయతీల్లో ‘ఆన్‌లైన్’ సేవలు అందించడం లక్ష్యంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. భవిష్యత్తులో ‘మీ సేవ’ కేంద్రాల తరహాలో ప్రభుత్వ సేవలను గ్రామీణుల ముంగిటకు చేర్చుతామని అధికారులు చెప్తున్నారు. కంప్యూటర్లు మంజూరు, ఆపరేటర్ల నియామకం,శిక్షణ వంటి కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ.. సేవలు అందించడంలో కీలకమైన మోడెంలు ఏర్పాటు చేయడంలో బీఎస్‌ఎన్‌ఎల్ జాప్యం చేస్తోంది.

 జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు గాను 320 పంచాయతీలను కంప్యూటరీకరించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ‘ఈ పంచాయతీ’లుగా పిలిచే 320 గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు సరఫరా, ఆపరేటర్ల నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాల అమలు బాధ్యతను హైదరాబాద్‌లోని కార్వీ అనే ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే ఎంపిక చేసిన ‘ఈ పంచాయతీ’లకు కంప్యూటర్లు మంజూరు చేయగా, వాటిని ఆయ పంచాయతీలకు సరఫరా చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం కూడా పూర్తయినట్లు సమాచారం. వీరికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ అనంతరం ఈ పంచాయతీల్లో విధులు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలి విడతలో 176 మంది కంప్యూటర్లు ఆపరేటర్లను నియమించగా, ఒక్కో ఆపరేటర్ రెండేసి ఈ పంచాయతీల్లో విధులు నిర్వర్తించనున్నట్లు సమాచారం. జనాభా, ఆన్‌లైన్ నెట్‌వర్క్ లభ్యత, పంచాయతీ ఆదాయం తదితర అంశాల ఆధారంగా ఈ పంచాయతీలను ఎంపిక చేశారు.

అయితే ఈ పంచాయతీ సేవల్లో ఇంటర్నెట్ కీలకం కాగా, బీఎస్‌ఎన్‌ఎల్ మోడెంలు అమర్చడంలో ఆలస్యమవుతోంది. ప్రయోగాత్మకంగా జిల్లాలో తొలుత 16 పంచాయతీలను ఈ పంచాయతీలుగా మార్చారు. ఇందులో మేజర్ గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలుగా ఆవిర్భవించడంతో ప్రస్తుతం తొమ్మిది పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో వున్నాయి. జడ్చర్ల, పెబ్బెరు, కొత్తూరు, మక్తల్, ఆత్మకూరు, కొత్తకోట, అమన్‌గల్, కోస్గి, కొడంగల్ పంచాయతీలు ప్రస్తుతం ‘ఈ పంచాయతీ’లుగా పనిచేస్తున్నాయి.

ఆర్దిక సంఘం గ్రాంటుతో లింకు

13వ ఆర్దిక సంఘం పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేస్తున్న గ్రాంటులో 70శాతం పంచాయతీలకే కేటాయించారు. మంచినీటి సరఫరా, పారిశుధ్యం, అంతర్గత రోడ్ల నిర్వహణ వంటి అంశాలతో పాటు గ్రాంటు ద్వారా పంచాయతీలను కంప్యూటరీకరించాలనే నిబంధన కూడా విధించారు. ఈ పంచాయతీ సేవలు అందుబాటులోకి వస్తే జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ, ఇంటిపన్నుతో సహా ఇతర పన్నుల చెల్లింపు, వ్యాపార లెసైన్సుల జారీ వంటి సేవలు సులభతరం కానున్నాయి. గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాల ఖాతా నిర్వహణ పారదర్శకంగా జరగనుంది. భవిష్యత్తులో ‘మీ సేవ’ తరహాలో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు, అదనపు ఆదాయం సమకూర్చే రీతిలో ఈ పంచాయతీల నిర్వహణ  ఉండాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement