అంబేడ్కర్ చూపిన బాటలోనే వైఎస్ పాలన: వైఎస్సార్‌సీపీ | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్ చూపిన బాటలోనే వైఎస్ పాలన: వైఎస్సార్‌సీపీ

Published Wed, Apr 15 2015 2:13 AM

అంబేడ్కర్ చూపిన బాటలోనే వైఎస్ పాలన: వైఎస్సార్‌సీపీ - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పాలనను సాగించారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాతకు నేతలు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. అట్టడుగు వర్గాలు, దళితుల అభివృద్ధి, వారి సంక్షేమాన్ని అంబేడ్కర్ నిరంతరం కాంక్షించారని, చివరి వరకూ అందుకోసమే తపించారని పొంగులేటి కొనియాడారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళిత, బలహీన వర్గాలకు ఎక్కువ మేలును చేకూర్చే సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా వైఎస్ చేశారని పేర్కొన్నారు. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వైఎస్ మాదిరిగానే సంక్షేమ పాలనను అందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచం గర్వించదగిన వ్యక్తి అంబేడ్కర్ అని, ఆయన ఒక్క దళితులకే నాయకుడు కాదని, అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి అని కొనియాడారు.
 
అంటరానితనంపై అలుపెరుగని పోరాటం
వందేళ్ల క్రితమే అంటరానితనం, దురాచారాలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ అలుపెరుగని పోరాటం చేశారని వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున శ్లాఘించారు. ఆయన కాంక్షించిన బడుగు వర్గాల సంక్షేమాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ ఆలోచన లు అంబేడ్కర్ ఆశయాలకు అద్దం పట్టేవిగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. ప్రజలందరి సంక్షేమానికి పాటుపడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి వైఎస్ కట్టుబడి పాలన సాగిస్తే ఇప్పటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పౌరహక్కులను కాలరాస్తూ అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో స్మగ్లర్లనే పేరుతో 20 మంది దళిత కూలీలను కాల్చిచంపడం, తెలంగాణలో వికారుద్దీన్ బృందాన్ని హతం చేయడం పౌరహక్కులను హరించడమేనన్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నేతలు కొండా రాఘవరెడ్డి, వాసిరెడ్డి పద్మ, చల్లా మధుసూదన్‌రెడ్డి, డా. ప్రపుల్ల రెడ్డి, వెల్లాల రామ్మోహన్, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి, కె.వెంకటరెడ్డి, దుద్దుకూరు శ్రీధర్ రెడ్డి, ఎం. జయరాజ్, నాగదేశి రవికుమార్, బండారు సుధాకర్, జార్జిహెర్భట్, ఎం.సందీప్‌కుమార్, వనజ, శ్యామల, క్రిస్టోలైట్ అంబేడ్కర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement