అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 8 2018 1:33 AM

Ampashayya Naveen Going To Receive Kaloji Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత అంప శయ్య నవీన్‌ను మరో ప్రఖ్యాత పురస్కారం వరించింది. కాళోజీ నారాయణరావు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే సాహితీ పురస్కారానికి ఈసారి అంపశయ్య నవీన్‌ను ఎంపిక చేశారు. కాళోజీ 104వ జయంతి సందర్భంగా ఈ నెల 9న సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. నవీన్‌కు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు.  

అధ్యాపకుడి నుంచి రచయితగా..
అంపశయ్య నవీన్‌ 1941లో వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో జన్మించారు. నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2004లో కాలరేఖలు రచనకు గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. ఆయన రాసిన కథల్లో చెర, బలి, దాడి ప్రముఖమైనవి. 1965–1968 మధ్య కాలంలో రచించిన తెలుగు నవల అంపశయ్య. ఇది నవీన్‌ రాసిన మొదటి నవల. చైతన్య స్రవంతి విధానంలో రాసిన ఈ నవల 1969లో తొలిసారి ప్రచురితమై, నేటికీ పాఠకాదరణ పొందుతోంది. ఈ నవల పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. తెలుగు, ఇంగ్లిష్‌ పత్రికల్లో ఆయన ఎన్నో సాహిత్య వ్యాసాలు కూడా రాశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement