ఎన్టీఆర్‌ను అవమానపర్చేందుకే పేరుమార్పు | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ను అవమానపర్చేందుకే పేరుమార్పు

Published Mon, Nov 24 2014 11:40 PM

ఎన్టీఆర్‌ను అవమానపర్చేందుకే పేరుమార్పు - Sakshi

శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన ఖ్యాతిని దిగజార్చి.. అవమానపర్చడమేనని  కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తే అందుకు సహకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాజీవ్‌గాంధీ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రాలో ఉన్న నాలుగు ఎయిర్‌పోర్టులతో పాటు నిర్మాణం చేయదల్చుకున్న వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని సూచించారు. చేసిన వాగ్దానాలను నేరవేర్చలేని స్థితిలో ఉన్న బాబు ఆంధ్రాలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశీయ టెర్మినల్‌కు పెట్టిన ఎన్టీఆర్ పేరును వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు మార్పుపై చిత్తశుద్ధిలేదని విమర్శించారు.

అసెంబ్లీలో తీర్మానం చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. పేరుమార్పుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏర్పాటు చేసిన ఘనత యూపీఏదేనని చెప్పారు. పేర్లు మార్చే సంస్కృతి మంచిది కాదని సబిత హితవుపలికారు. ప్రస్తుతం చేసే ధ ర్నా కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్టీఆర్ పేరును తొలగించే వరకు ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్రి ప్రసాద్ పేర్కొన్నారు.

ప్రసంగాల అనంతరం సర్వే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు జాతీయరహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ తర లించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, కాంగ్రెస్ యువనేత కార్తీక్‌రెడ్డి , జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Advertisement