నిజాం సేనలపై నిప్పుల తూటా | Sakshi
Sakshi News home page

నిజాం సేనలపై నిప్పుల తూటా

Published Fri, Mar 14 2014 8:36 PM

మహ్మదాపూర్ గుట్టల్లో నిర్మించిన అనభేరి సమాధి (ఇన్‌సెట్లో) ప్రభాకర్‌రావు

* రణధీరుడై నిలిచిన అనభేరి ప్రభాకర్‌రావు
* తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు
* ప్రజలకోసం ప్రాణాలర్పించిన 12 మంది వీరులు
* నేడు 69వ వర్ధంతి
 
హుస్నాబాద్, న్యూస్‌లైన్: పోలంపల్లి ముద్దు బిడ్డ.. పోరుతల్లి తొలిబిడ్డ.. అమరుడా అనభేరి ప్రభాకరా.. అందుకో పోరుదండాలు.. అంటూ ఆ పల్లెల్లో విప్లవ గీతాలు మార్మోగుతాయి. నాజీలను మించిన నైజాముపై రణం జేసిన ఆ వీరుడి జ్ఞాపకాలను పల్లెప్రజలు నెమరు వేసుకుంటారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన నిలిచి పోరాడిన ఆ యోధుడిని తులుచుకుంటూ కమ్యూనిస్టులు సెల్యూట్ చేస్తారు.

రజాకార్ల అకృత్యాలకు వంతపాడే జాగీర్‌దార్లు, భూస్వాముల మధ్య నలిగిపోయిన ప్రజలకోసం బందూకు పట్టిన తొలి యోధుడికి నివాళులర్పిస్తారు. 1948 మార్చి 14వ తేదీన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో నిజాం సేనలతో భీకర పోరాటం చేసి నేలకొరిగిన అనభేరి ప్రభాకర్‌రావుతో పాటు 11 మంది వీరులను స్మరించుకుంటారు. శుక్రవారం వారి 69వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిపోసిన ఆ ఘట్టం పాఠకుల కోసం..

నిజాం పాలనలో పల్లెలు విలవిలలాడుతున్న రోజులు. ప్రజలపై రజాకార్ల అకృత్యాలకు అంతు లేకుండాపోయింది. భూస్వాముల ఆగడాలు మితిమీరిపోయాయి. దీనిని ప్రశ్నించేవారే లేకుండాపోయారు. ఇలాంటి తరుణంలో ఓ యువకుడు నిజాం పీడనలో మగ్గుతున్న ప్రజల్లో తిరుగుబాటు లేవనెత్తాడు. సత్తువ చచ్చిన ప్రజలు పిడికిలి బిగించేలా చేశాడు. ఆయనే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు.

1913లో అనభేరి వెంకటేశ్వర్‌రావు, రాధాబాయి దంపతులకు జన్మించిన ఆయన చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలను అలవర్చుకున్నాడు. నిజాం పెట్టే బాధలకు ప్రజలు తల్లడిల్లడం దగ్గరి నుంచి చూసేవాడు. తన కుటుంబం, బంధువులు మిన్నకున్నా ఆయన అన్యాయాలను ప్రశ్నించేవాడు. ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వాన్ని బోధించేవాడు. కుటుంబసభ్యులు వారించినా గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేశాడు. రజాకార్లను గ్రామాలకు రాకుండా తరిమికొట్టాడు. భూస్వాముల చేతుల్లో ఉన్న భూములన్నీ పేదలకు పంచాడు.

ఈ క్రమంలో నిజాం సేనలు మరింత పటిష్టమై గ్రామాల్లో దాడులకు దిగాయి. వారిని ఎదురించేందుకు అనభేరి ప్రభాకర్‌రావు ఆయుధాలు చేతబట్టి దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దళంలో సింగిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చుక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అయిరెడ్డి భూంరెడ్డి, తూమోజు నారాయణ, బి.దామోదర్‌రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్లగొండ రాజారాం, సిక్కుడు సాయిలు, రొండ్ల మాధవరెడ్డిని చేర్చుకున్నారు. వీరు ఎప్పటికప్పుడు నిజాం సేనలను పసిగడుతూ ప్రజలను కాపాడేవారు.

ఉత్తర తెలంగాణలో పోరాటం విస్తృతం కావడంతో నిజాం సేనలు మరింత రెచ్చిపోయాయి. అనభేరి దళాన్ని మట్టుబెట్టాలనే వ్యూహంతో కదులుతున్నాయి. అయితే ప్రజలు ఆ దళాన్ని కాపాడుతూనే ఉన్నారు. అది 1948 మార్చి 14వ తేదీ. అనభేరి ప్రభాకర్‌రావు దళం సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో ప్రజలతో సమావేశమై వారిలో ధైర్యం నూరిపోసింది. అక్కడి నుంచి మహ్మదాపూర్ సమీపంలోని గుట్టల్లో విశ్రాంతి తీసుకుంటుండగా రజాకార్ల తొత్తు అయిన ఓ వ్యక్తి ఆ సమాచారాన్ని నిజాం సేనలకు అందించాడు. దీంతో ఆ సేనలు గుట్టలను చుట్టుముట్టాయి. కాల్పులు ప్రారంభించడంతో అప్రమత్తమైన అనభేరి దళం రెండుగా చీలింది.

ఒకవైపు అనభేరి ప్రభాకర్‌రావు, మరోవైపు సింగిరెడ్డి భూపతిరె డ్డి నాయకత్వం వహిస్తూ నిజాం సేనలపై ఎదురు కాల్పులు జరిపారు. ఉన్నది 12 మంది అయినా నిజాం సేనలను గడగడలాడించారు. హోరాహోరీ పోరులో ముందుగా సింగిరెడ్డి భూపతిరెడ్డి నేలకొరిగాడు. రజాకార్ల తూటాలకు  కిందపడ్డ ఆయన తుపాకీని అనభేరి వైపు విసిరేశాడు. దానిని అందుకొని రెండు తుపాకులతో అనభేరి కాల్పులు సాగించాడు. అయినా వందలాది నిజాం సేనలు 12 మంది వీరులను చంపేశాయి. కాగా, వీరులు నేలకొరిగిన మార్చి 14వ తేదీన ఏటా మహ్మదాపూర్ గుట్టల్లో సీపీఐ ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహిస్తారు.
 
చారిత్రక ప్రదేశంగా మారేనా?
వీరుల రక్తంతో తడిచిన మహ్మదాపూర్ గుట్టల ప్రాంతాన్ని చారిత్రక ప్రదేశంగా మార్చుతామన్న నేతల హామీలు నెరవేరలేదు. సీపీఐ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement