ఇవాంకా ఇక్కడికి రావొద్దు! – ఇట్లు అంజలి | Sakshi
Sakshi News home page

ఇవాంకా రావొద్దు! – ఇట్లు అంజలి

Published Fri, Nov 3 2017 1:25 AM

anjali says ‘Please don't come Ivanka’, Who is Anjali? - Sakshi

అంజలి.. పోలియోతో ఒక కాలు, చేయి పడిపోయాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద బిచ్చమెత్తుకుని పొట్టపోసుకుంటోంది.. ఇవాంకా ట్రంప్‌.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె.. మరి అక్కడెక్కడో వైట్‌హౌస్‌లో ఉండే ఇవాంకాకు.. ఇక్కడ రైల్వే స్టేషన్‌ వద్ద బిచ్చమెత్తుకునే అంజలికి ఏంటి లింకు?  ఇంతకీ అంజలి.. ఇవాంకా హైదరాబాద్‌కు రావొద్దని ఎందుకంటోంది?

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని యాచకులపై ఇవాంకా’ పిడుగుపడింది.. హైదరాబాద్‌లో జరుగనున్న సదస్సుకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె వస్తున్నందున ‘బెగ్గర్‌ఫ్రీ యాక్ట్‌’ నిద్ర లేచింది.. యాచకులెవరూ రోడ్లపై కనబడకూడదని.. వారిని నగర శివార్లలోని సంక్షేమ నిలయాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందుకోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన సిబ్బంది సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు.. యాచకులందరినీ వ్యాన్‌ ఎక్కించారు.. అంజలినీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.. దాంతో ఆమె సిబ్బంది కాళ్లావేళ్లా పడింది.. తన ఇద్దరు పిల్లలు ఆగమవుతారని చెప్పింది.. దాంతో వారు అడుక్కోవద్దని హెచ్చరించి వెళ్లిపోయారు.. దాంతో ఆమె ఒక్కసారిగా ఆవేదనకు లోనైంది.. ఏ పనీ చేసుకోలేని వైకల్యం.. ఎలా బతకాలి, తన పిల్లలు సిరి, కీర్తిలను ఎలా పోషించాలి? ఎలా చదివించాలనే ఆందోళనలో మునిగిపోయింది..

చివరికి దాచిపెట్టుకున్న పదీ, పరకా కూడేసి, అప్పు చేసి ఓ బరువు తూచే మెషీన్‌ కొనుక్కొంది.. నిన్నటివరకు డబ్బులు దానం చేసినవారు.. ఇప్పుడు బరువు చూసుకుని అయినా చిల్లర ఇవ్వకపోతారా అని భావించింది. కానీ ఒక్కరూ బరువు చూసుకోవడం లేదు, రోజూ తిండికి సరిపడా డబ్బులైనా రావడం లేదు. అటు యాచించే మార్గం లేక, ఇటు ఉపాధికి అవకాశం లేక అంజలి తల్లడిల్లిపోతోంది. ‘‘అసలు నేను, నా బిడ్డలు బతికేదెట్లా..?’’ అని ఆక్రోశిస్తోంది. ఏ ప్రభుత్వానికి.. చట్టాలు, నిబంధనలకు అంతుబట్టని ఈ ఆవేదన ఒక్క అంజలికే కాదు.. తమను ఎందుకు, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియని ఆందోళనలో ఉన్న వేల మంది యాచకుల దీనస్థితి ఇది.  

♦ నగరవ్యాప్తంగా..
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, ప్రధాన బస్‌స్టేషన్లు, కూడళ్లు, గుళ్లు, మసీదులు, మందిరాల వద్ద యాచిస్తున్న వారంతా కొద్దిరోజులుగా బెంబేలెత్తిపోతున్నా రు. త్వరలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగనుండటం, దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా హాజరవు తుండటంతో ప్రభుత్వం ‘బెగ్గర్‌ఫ్రీ సిటీ’ కోసం చర్యలు చేపట్టింది. యాచకులను చంచల్‌గూడ, చర్లపల్లి కారాగారాల్లో ఏర్పాటు చేసిన ‘ఆనంద నిలయాలు, కారుణ్య కేంద్రా’లకు తరలిస్తోంది. దాంతో యాచకులు తమను ఎక్కడికి తరలిస్తు న్నారో, ఎందుకు తరలిస్తున్నారో, ఎప్పుడు వదులుతారోనన్న ఆందోళనలో పడిపోయారు.

తమకు కుటుంబాలు ఉన్నాయంటూ ఆధార్‌ పత్రాలను చూపుతున్నారు. ఇప్పటివరకు ఆనంద నిలయం, కారుణ్య కేంద్రం సహా పలు చోట్లకు 300 మందికిపైగా యాచకులను తర లించినట్లు అంచనా. అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌లు చేపడుతూ.. కనిపించిన యాచకులను  వ్యాన్‌ ఎక్కించి తరలించేస్తున్నారు. ఆ కేంద్రాల నుంచి బయటికి రాకుండా ఉంచేస్తున్నారు. అయితే యాచించాల్సిన అవసరం లేకుండా బతకాలని కోరుకోవడం, అందుకు తగిన పరిస్థితులను, ఉపాధి అవకాశాలను కల్పించడం ఉన్నతమైన కార్యక్రమమే అయినా.. ఎవరికోసమో ఉన్నఫళంగా తరలించి, నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ‘ఇవాంకా రావొద్దు్ద..’ అన్న ఆక్రోశం కనిపిస్తోంది.

♦ అంజలి, పిల్లల బతుకు గడిచేదెలా..?
జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్‌ వరకు బస్సులో వచ్చి అక్కడ అడుక్కొంటోంది. హైదరాబాద్‌ శివార్లలో ని జీడిమెట్లలో నివాసముంటున్న అంజలి తల్లిదం డ్రులు చిన్నవయసులోనే చనిపోయారు. పోలియోతో చిన్నప్పుడే ఒక కాలు, ఒక చెయ్యి చచ్చుపడిపోయాయి. కొందరు తెలిసినవాళ్ల సాయంతో ఓ పూరి గుడిసెలో ఉంటూ పదోతరగతి వరకు చదివింది.

ఆమెకు కొన్నేళ్ల కింద సురేశ్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తోడుగా నిలుస్తానని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు సిరి, కీర్తి పుట్టారు. కానీ మద్యానికి బానిసైన సురేశ్‌.. వైకల్యమున్న ఆమెను చిన్నచూపు చూశాడు. కొంతకాలానికి వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు, తిరిగి రాలేదు. దీంతో అంజలి బతుకు ప్రశ్నార్థకంగా మారింది. చివరికి ఏం చేయాలో తెలియక యాచిం చడం మొదలుపెట్టింది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆమెను కలసినప్పుడు తన ఆవేదనను కన్నీటితో చెప్పుకొంది. ‘‘నా భర్త మొదట్లో బాగానే ఉండేవాడు. రాను రాను కాలూ చెయ్యీ లేదని చిన్నచూపు చూశాడు. తాగి వచ్చి నానా బీభత్సం చేసేవాడు, బాగా కొట్టేవాడు. చివరకు నన్ను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. నేను బతికి, పిల్లలను బతికించుకోవాలి కదా. అందుకే అడుక్కోవడం మొదలుపెట్టిన. పెద్దబిడ్డ ఒకటో తరగతి, చిన్నది ఇప్పుడే బడికి వెళుతోంది.

రోజూ జీడిమెట్లలో వాళ్లను బడికి పంపించి నేను బస్సులో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తాను. పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి తిరిగి వెళ్తాను. తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి బరువు మిషన్‌ తెచ్చిన. కానీ ఎవరూ బరువు చూసుకోవడం లేదు. దీంతో యాచనే దిక్కు అయింది. ఇప్పుడు యాచించే అవకాశం లేదు.  పైసలు రావడం లేదు. పస్తులు ఉండాల్సి వస్తోంది. నేను, నా పిల్లలు ఎట్లా బతకాలి సార్‌..’’ అని కన్నీటి పర్యంతమైంది.

♦ పునరావాసం.. సర్వేలకే పరిమితం
జీహెచ్‌ఎంసీ, నిరాశ్రయ శ్రామిక్‌ సంఘటన్‌ వంటి సంస్థల సర్వేల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 5,000 మంది యాచకులు ఉన్నారు. వారిలో ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్‌ వంటి ధ్రువపత్రాలు, కుటుంబాలు ఉన్న యాచకులు కొందరైతే.. ఏ ఆధారమూ లేని అనాధలు, వృద్ధులు, దివ్యాంగులు, దగాపడినవారు మరికొందరు ఉన్నారు. కారణం ఏదైనా యాచించి బతకాల్సిన దుస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు.

యాచనే ఉపాధిగా మలుచుకొని బతుకు తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. వారు పుట్టుకతోనే తమ పిల్లలను భిక్షాట నలోకి దింపుతున్నారు. ఇలా యాచక వృత్తితో వీధిన పడ్డ బాల్యం నుంచి నేరప్రవృత్తి పుట్టుకువస్తోంది. పరిస్థితి ఇలా ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. యాచకులకు పునరావాసం కల్పిస్తామన్న ప్రకటనలు, జీహెచ్‌ంఎసీ సర్వేలు కాగితాలకే పరిమితమయ్యాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement