పంట పొలాల్లో మరణ మృదంగం | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో మరణ మృదంగం

Published Thu, Sep 3 2015 3:00 AM

పంట పొలాల్లో మరణ మృదంగం - Sakshi

ఆగని అన్నదాతల ఆత్మహత్యలు

♦ అప్పుల బాధతో.. ఏడుగురు రైతుల బలవన్మరణం
♦ గుండె ఆగి మరో ఇద్దరు రైతుల మృతి.. పల్లెల్లో విషాదం
 
 సాక్షి, నెట్‌వర్క్ : తెలంగాణ జిల్లాల్లో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. బుధవారం ఒక్క రోజే వివిధ జిల్లాల్లో  మొత్తం ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారు.  వివరాలు.. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లికి చెందిన నల్ల కిష్టయ్య (40) వ్యవసాయం కోసం రూ.3 లక్షల వరకు  అప్పులు  చేశాడు. అవి తీరే మార్గం కనబడక బుధవారం తెల్లవారుజామున చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామానికి చెందిన వెంకటనర్సయ్య(63) వ్యవసాయానికి చేసిన అప్పులు రూ. 4 లక్షలు పేరుకుపోయూరుు.

అప్పు ఎలా తీర్చాలని మధనపడుతూ మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందుతాగి మృతిచెందాడు.  మెదక్ జిల్లా ములుగు మండలం అన్నాసాగర్‌కు చెందిన రైతు గూడూరి మల్లారెడ్డి (42) వరి, మొక్కజొన్న సాగు కోసం సుమారు రూ.ఐదు లక్షల వరకు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చే మార్గం కన్పించక తీవ్ర మనస్తాపానికి గురైన మల్లారెడ్డి.. మంగళవారం రాత్రి ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద పురుగుల మందు తాగాడు.   ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మునగాల రైతు తేజావత్ మంగ్యా(36) గత ఏడాది తనకున్న ఎకరం పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగుచేశాడు.

పంట సక్రమంగా పండక, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో గత ఏడాది రూ.1.50 లక్షలకుపైగా అప్పులయ్యాయి. ఈ ఏడాది అప్పులు పుట్టడంలేదని మనస్తాపానికి గురైన మంగ్యా ఇంటికివచ్చి క్రిమిసంహారక మందు తాగాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నబోనాలకు చెందిన అంబటి నారాయణ(45) వ్యవసాయం కోసం రూ.4 లక్షల అప్పు చేశాడు. మంగళవారం రాత్రి  పురుగుల మందు తాగి చనిపోయూడు.

తిమ్మాపూర్ మండ లం పొరండ్ల గ్రామానికి చెందిన ముస్కు నాగిరెడ్డి(47) వ్యవసాయ పెట్టుబడుల కోసం రూ.3 లక్షల దాకా అప్పు చేశాడు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన నాగిరెడ్డి రాత్రి వరకూ తిరిగి రాలేదు. ఇంటికి సమీపంలోని పత్తి చేనులో క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. కోరుట్ల పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన మామిడిపల్లి రాములు(58) పంటల సాగుకు, కొడుకు వైద్యఖర్చుల కోసం చేసిన అప్పులు రూ.5 లక్షలకు చేరాయి. దీంతో మనస్తాపం చెంది బుధవారం తన వ్యవసాయ భూమి సమీపంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకున్నాడు.   

 గుండె ఆగి మరో ఇద్దరు...
 రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన మాడిశెట్టి జలపతి అనే రైతు బుధవారం పొలానికి క్రిమిసంహారక మందు పిచికారీ చేయడానికి వెళ్లి అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ఆదిరాల సైదులు(31) ఇంటి అవసరాలు, పెట్టుబడుల కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిడితో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు.

Advertisement
Advertisement