విద్యుత్‌లో మరో పేచీ! | Sakshi
Sakshi News home page

విద్యుత్‌లో మరో పేచీ!

Published Thu, Dec 4 2014 1:36 AM

విద్యుత్‌లో మరో పేచీ! - Sakshi

  • తెలంగాణ డిస్కమ్‌లకు నోటీసులిచ్చిన ఏపీఈఆర్‌సీ
  •  ఉమ్మడి రాష్ట్రంలోని అంశాలపై వివరణ కోరిన సంస్థ
  • సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య ఇప్పటికే పలు రకాల వివాదాలు కొనసాగుతుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మరో జగడానికి తెరలేపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పలు రకాల కేసులకు సంబంధించి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

    ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన అంశాలతోపాటు ఏపీఈఆర్‌సీలో పెండింగ్‌లో ఉన్న ల్యాంకో విద్యుత్ సంస్థ స్థాపిత సామర్థ్యం, దానికి చెల్లించాల్సిన బకాయిల అంశం, అలాగే స్పెక్ట్రమ్ పవర్‌కు సంబంధించి నాఫ్తాతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి తదితర 60కిపైగా అంశాలపై ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసి, దానికి చైర్మన్, ఇద్దరు సభ్యులను కూడా నియమించింది. అదే ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్క చైర్మన్‌ను మాత్రమే నియమించింది.

    కమిషన్‌లో సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన సభ్యులను నియమించాల్సి ఉన్నా ఇంకా ఆ పని చేయలేదు. కానీ ఏపీఈఆర్‌సీ పలు కీలకమైన సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించి దాదాపు 60కి కేసుల నోటీసులను తెలంగాణ డిస్కమ్‌లకు జారీ చేసింది. వాస్తవంగా తెలంగాణ ఏర్పడి ఆరు నెలలు కావడమేకాక. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరును కూడా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌గా మార్చింది.

    కానీ ఏపీఈఆర్‌సీ నోటీసులను ఏపీసీపీడీసీఎల్ పేరుతో ఇవ్వడం గమనార్హం. అయితే తెలంగాణ రాష్ట్రంలోని డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసే అధికారం పొరుగు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్రాష్ట్ర వివాదాలు ఉంటే వాటిని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి చూసుకుంటుందని, అంతే తప్ప మరో రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థకు నోటీసులు ఎలా జారీ చేస్తారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement