బీసీ జాబితాలో మరో 30 కులాలు | Sakshi
Sakshi News home page

బీసీ జాబితాలో మరో 30 కులాలు

Published Fri, Jun 28 2019 2:11 PM

Another Thirty Castes Will Added To BC List - Sakshi

సాక్షి, అంబర్‌పేట: వెనుకబడిన కులాల జాబితాలో మరో 30 కులాలను చేర్చేందుకు సమాయత్తమయ్యామని, కొత్తగా చేరే కులాలకు చెందిన వారికి ఏవైనా ఆక్షేపణలు ఉంటే జూలై 5లోపు తుది గడువుగా నిర్ణయించామని హైదరాబాద్‌ జిల్లా బీసీ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విమలాదేవి వెల్లడించారు. గురువారం అంబర్‌పేట గోల్నాకలోని బీసీ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్‌ చట్టంలోని 9(1)వ విభాగం ద్వారా ఈ నెల 15న నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన బీసీ జాబితాలోకి చేర్చే కులాల పేర్లను ఆమె వెల్లడించారు. కాకిపడగల, మందెచ్చెల సన్నాయోళ్లు/బత్తిన, మాసయ్యలు/ పటంవారు, సాధనశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవులవారు, గౌడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సారోళ్లు, అరవ కోమటి, ఆహీర్‌ యాదవులు, గౌవిలి తదితర ముప్‌పై కులాలు వెనుకబడిన తరగతుల కులాల జాబితాలోకి చేరనున్నాయని ఆమె తెలిపారు.

పైన పేర్కొన్న కులాలకు చెందిన వారు ఏవైనా ఆక్షేపణలు, అభ్యంతరాలతో పాటు సలహాలు, సూచనలు ఉంటే ఈ నెల 28 నుంచి జూలై 5 వరకు (సెలవు రోజులు మినహాయించి) హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్‌ కార్యాలయంలో అఫిడవిట్‌తో పాటు తగిన ఆధారాలతో తెలియపరచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారులు మురళి, వరలక్ష్మి, సుధాకర్, రాధాకిషోరి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement