‘సాగర్‌’లో కనీస నీటి మట్టం కష్టమే | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’లో కనీస నీటి మట్టం కష్టమే

Published Wed, Mar 1 2017 2:22 AM

‘సాగర్‌’లో కనీస నీటి మట్టం కష్టమే - Sakshi

పంపులు దించి నీటిని తోడాల్సిందే
మెట్రో వాటర్‌ బోర్డుకు నీటిపారుదలశాఖ స్పష్టం  


సాక్షి, హైదరాబాద్‌: రాజధాని తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో ఈ ఏడాది సైతం కనీస నీటి మట్టాలను నిర్వహించడం సాధ్యం కాదని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండ బ్ల్యూఎస్‌ఎస్‌బీ)కు నీటిపారుదల శాఖ తేల్చి చెప్పింది.  శ్రీశైలం, సాగర్‌లో నెలకొన్న నీటి కొరత, మున్ముందు ఉన్న రబీ సాగు, తాగు అవసరాల దృష్ట్యా, కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తోడేలా పంపులను దించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

824 అడుగులకు చేరిన శ్రీశైలం
ఈ ఏడాది ఎగువన శ్రీశైలం నుంచే అధిక నీటి వినియోగం జరగడంతో సాగర్‌కు అనుకున్న స్థాయిలో నీటి విడుదల కాని విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సాగర్‌లో నీటినిల్వ.. 590 అడుగులకు గానూ 514 అడుగులకు చేరింది. ఈ మట్టంలో ప్రస్తుతం 138 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా, కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 7 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. ఇప్పటికే శ్రీశైలం కనీస నీటి మట్టం దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తోడేసుకుంటున్నాయి. ఇక్కడ కనీస నీటిమట్టం 834 అడుగులైతే ఇప్పటికే అది 824 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో సాగర్‌లో ఉన్న లభ్యత నీటినే  సాగు, తాగు అవసరాలకు వాడాల్సి ఉంది. ఇందులో సాగర్‌ కింద సాగు చేసిన రబీల పంటలకు కొన్ని విడతల్లో నీటి సరఫరా జరగ్గా, మరింత నీటిని సరఫరా చేయాల్సి ఉంది.

హైదరాబాద్‌కు 8 టీఎంసీలు అవసరం
హైదరాబాద్‌ అవసరాలకు నెలకు 1.8 టీఎంసీల చొప్పున సాగర్‌ నుంచే విడుదల చేయాల్సి ఉంది. జూన్‌లో వర్షాలు కురిసి ప్రవాహాలు మొదలయ్యే వరకు తాగునీటికి 8 టీఎంసీలైనా అవసరం ఉంటుంది. ప్రస్తుతం కనీస నీటి మట్టానికి ఎగువన ఉన్న నీటితో ఈ అవసరాలను తీర్చడం సాధ్యం కానందు న కచ్చితంగా కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తీసుకోవాల్సిందే. కిందటేడాది సైతం ఇదే రీతిన  503 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు.

ఈ ఏడాది సైతం అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కనీస నీటి మట్టాలను నిర్వహిం చాలన్న హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ వినతిని నీటిపారుదలశాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతం ఉన్న నీటిని జూన్‌ వరకు కాపాడటం కష్టతర మని, ఈ దృష్ట్యా వేసవి కాలానికి ముందు గానే పంపులను కిందికి దించే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement