మళ్లీ ‘డబుల్‌’ దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘డబుల్‌’ దరఖాస్తులు

Published Fri, Dec 21 2018 9:57 AM

Applications For Double Bedroom Scheme - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అర్హులై ఉండీ ఇప్పటి వరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు దరఖాస్తు చేసుకోని వారికి శుభవార్త. ప్రభుత్వం ‘డబుల్‌’ ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వనుంది. అయితే ఒక కుటుంబం ఒక చోట మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా తగిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన తర్వాత తిరిగి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల దరఖాస్తులను ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల దరఖాస్తులకు సంబంధించి తగిన విధివిధానాలు రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉందని, అది పూర్తయ్యాక తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిస్తుందని వెల్లడించారు.

రాష్ట్రంలో పలువురు జిల్లాల్లోని సొంత గ్రామాలతో పాటు నగరంలోనూ డబుల్‌ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఒకరు ఒకచోట మాత్రమే దరఖాస్తు చేసుకునేలా తగిన ఏర్పాట్లు చేయడం, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని విధానాలు రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు పొందిన వారు సైతం డబుల్‌ ఇళ్లు పొందేందుకు అనర్హులన్నారు. ఆయా పథకాల కింద నిర్మించిన ఇళ్లు ఒకరి పేరు మీదుంటే, మరొకరు నివసిస్తున్నారన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఒకరు ఒక పథకం ద్వారా మాత్రమే గృహసదుపాయం పొందేలా విధా నాలు ఉంటాయన్నారు. నగరంలో ఇప్పటికే 3ల క్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వాటిని పరిశీలనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. 

దళారులను నమ్మొద్దు...  
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులడిగితే ఇవ్వవద్దని మేయర్‌ ప్రజలకు సూచించారు. ప్రజలకు ఉచితంగా ప్రభుత్వమే వీటిని నిర్మించి ఇస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఎవరైనా ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించ తలపెట్టిన స్టీల్‌బ్రిడ్జిని హిందీ మహావిద్యాలయ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ మార్గంలో ఫ్లైఓవర్‌తో పాటు రహదారిని వైట్‌టాపింగ్‌ రోడ్‌గా డక్టింగ్‌తో వేయనున్నట్లు చెప్పారు. భూగర్భ కేబుల్‌ షిఫ్టింగ్‌ పనులకు రూ.2.90 కోట్లు మంజూరు ప్రతిపాదన లకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ను అభినందిస్తూ సమావేశం తీర్మానం చేసిందన్నారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న, పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ పనులు, స్వచ్ఛ కార్యక్రమాలు తదితర అంశాలపై సర్కిళ్ల వారీగా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 ర్యాంకుల్లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కార్పొరేటర్లు మరింత చురుగ్గా భాగస్వాములు కావాలన్నారు. ఆయా ప్రాజెక్టు పనులకు జీహెచ్‌ఎంసీలోనే భూసేకరణ అధికారి నియామకం వేగంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా దానకిశోర్‌ బాధ్యతలు స్వీకరిం చాక తొలిసారిగా జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి మేయర్‌ అధ్యక్షత వహించారు.

Advertisement
Advertisement