పకడ్బందీగా ‘టెట్’ నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘టెట్’ నిర్వహించాలి

Published Sat, Mar 15 2014 3:14 AM

Armored and composition to be carried out

  •     ఎలాంటి లోపాలు తలెత్తొద్దు
  •      సీఎస్, డీఓల సమావేశంలో కలెక్టర్ కిషన్
  •  విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జి.కిషన్ ఆదేశించారు. 16వ తేదీ ఆదివారం టెట్ జరగనున్న సందర్భంగా హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ఆవరణలో టెట్ పరీక్ష నిర్వహణలో భాగస్వాములయ్యే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెం టల్ ఆఫీసర్లతో పాటు రూట్ ఆఫీసర్లు, స్క్వాడ్ బృందాల సమావేశం శుక్రవారం నిర్వహించారు.

    ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలో కాపీ జరగడంతో ఆ పరీక్ష రద్దు చేసేలా ప్రతిపాదనలు పంపించామని గుర్తు చేస్తూ... టెట్ నిర్వహణలో అలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. నిర్ధేశించిన సమయం తర్వాత అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించొద్దని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమార్ మాట్లాడుతూ టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు.

    ఈ సందర్భంగా సీఎస్‌లు, డీవోలు, రూట్ ఆఫీసర్ల బాధ్యతలను వివరించడమే కాకుండా నిబంధనలతో కూడిన పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, నరేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, ఏడీ వెంకటరమణ, ఎంఈఓ వీరభద్రునాయక్, సీనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, ఎస్‌బీ.శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాస్, సూపరింటెండెంట్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
     
    కాగా, సీఎస్, డీఓల సమావేశం ముగిశాక కలెక్టర్ కిష న్ డీఈఓ చాంబర్‌కు వెళ్లారు. కార్యాలయంలోని ఎస్టాబ్లిష్‌మెంట్, లీగల్ సెక్షన్‌ను పరిశీలించిన అనంతరం చాంబర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు, కార్యాలయ ఆవరణ లో సుందరీకరణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
     
    పేపర్-1కు 12, పేపర్-2కు 94 కేంద్రాలు
     
    టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) కోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పేపర్-1 పరీక్ష ఉదయం 9-30నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు నిర్వహిం చనుండగా 12 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ పరీక్షకు 2,598మంది హాజరుకానున్నారు. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుండగా 94 కేంద్రాలు ఏర్పాటుచేశామని, 21,932 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని డీఈఓ విజయ్‌కుమార్ తెలిపారు.

    ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడమే కాకుండా అక్కడి జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నట్లు వివరించారు. కాగా, అభ్యర్థులు నిర్ధేశించిన సమయం కంటే గంట ముందుగా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. హాల్‌టికెట్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే గత నెలలో పరీక్ష పోస్ట్‌పోన్ కావడానికి ముందు జారీ చేసిన హాల్‌టికెట్లను కూడా అనుమతిస్తామని డీఈఓ వివరించారు.
     

Advertisement
Advertisement