డిసెంబర్ నాటికి నగరానికి ‘కృష్ణా’ నీళ్లు | Sakshi
Sakshi News home page

డిసెంబర్ నాటికి నగరానికి ‘కృష్ణా’ నీళ్లు

Published Tue, Oct 21 2014 12:26 AM

డిసెంబర్ నాటికి నగరానికి ‘కృష్ణా’ నీళ్లు - Sakshi

  • మంత్రి పద్మారావు వెల్లడి
  •  సీఎం ఆదేశాల మేరకు పైపులైన్ పనుల పరిశీలన
  • సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ ప్రాజెక్టును వచ్చే డిసెంబర్‌నాటికి పాక్షికంగా పూర్తిచేసి నగరానికి 22.5 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో మూడోదశ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, తద్వారా గ్రేటర్‌కు 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలు అందుతాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన సోమవారం మూడోదశ పనులను జలమండలి ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

    నగర శివార్లలోని సాహెబ్‌నగర్ నుంచి  గోడకొండ్ల, గున్‌గల్, నాసర్లపల్లి, నల్లగొండ జిల్లా కోదండాపూర్ వరకు సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న పైప్‌లైన్, పంప్‌హౌజ్, నీటిశుద్ధి కేంద్రాల పనులను పరిశీలించారు. పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై నాటికి గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తిచేసి నగరానికి 170 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను సరఫరా చేయనున్నామన్నారు.

    నాగార్జున సాగర్ జలాశయంలో నీటినిల్వలు తగ్గినపుడు డెడ్‌స్టోరేజి నుంచి సైతం గ్రేటర్ తా గునీటి అవసరాలకు అవసరమైన నీటిని సేకరించేం దుకు సుంకిశాల కృష్ణా హెడ్‌వర్క్స్ పనులను పూర్తిచేస్తామన్నారు. ఇందుకోసం రూ.840 కోట్ల అంచనా వ్యయంతో రూ పొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించనున్నామని తెలిపారు. కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌కు ఆనుకొని ఉన్న గ్రామాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తామన్నారు.
     
    అవసరమైతే కృష్ణా నాలుగోదశ..

    రాబోయే పదేళ్లలో నగర జనాభా ప్రస్తుతం ఉన్న కోటి నుంచి రెండు కోట్లకు చేరుకుంటుందని..అప్పటి జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే కృష్ణా నాలుగోదశ పథకాన్ని చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి పద్మారావు చెప్పారు. కృష్ణా జలాల్లో 30 టీఎంసీలకు గాను ప్రస్తుతం కృష్ణా మూడుదశల ప్రాజెక్టుల ద్వారా 16.5 టీఎంసీల జలాలను నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నామన్నారు.

    నీటి వృథాను అరికట్టడం,జలమండలి నష్టాలను అధిగమించేందుకు కనీసం నీటి శుద్ధికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేయక తప్పదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జలమండలి ఎండీ జగదీశ్వర్, డెరైక్టర్లు రామేశ్వర్‌రావు, కొండారెడ్డి, సత్యనారాయణ, ఎల్లాస్వామి, జలమండలి ఉన్నతాధికారులు ఇతర టీఆర్‌ఎస్ నాయకులున్నారు.
     
    కృష్ణా ప్రాజెక్టు లోన్‌కు రూ.15 కోట్లు విడుదల..

    కృష్ణా మొదటి,రెండవ దశ ప్రాజెక్టుల కోసం గతంలో జలమండలి సేకరించిన రుణానికి సంబంధించి వాయిదా చెల్లించేందుకు రూ.15 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది.
     

Advertisement
Advertisement