చంద్రబాబువన్నీ డ్రామాలే : ఓవైసీ | Sakshi
Sakshi News home page

చంద్రబాబువన్నీ డ్రామాలే : ఓవైసీ

Published Mon, Sep 10 2018 8:47 PM

Asaduddin Owaisi fires on Chandrababu naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో అంటకాగి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు డ్రామాలు చేస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ మళ్లీ బీజేపీతో కలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే పార్టీతో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారన్నారు. ఇక్కడికి వచ్చినా పెద్దగా చేసేదేమీ లేదు, జీరోకావడం తప్ప అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ పొత్తును ప్రజలు తిప్పికొడతారని అసదుద్దీన్ అన్నారు. పొత్తుతో కాంగ్రెస్, టీడీపీ నిండామునుగుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని పెద్ద పెద్ద నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, తనకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. పదవులపై తమకు ఎప్పుడూ ఆశ లేదన్న ఓవైసీ.. మైనార్టీలు, బలహీనవర్గాల కోసం తమ పార్టీ పాటుపడుతుందని అన్నారు. కేసీఆర్‌ తన పాలనపై విశ్వాసం ఉండటం వల్లే టీఆర్‌ఎస్ పదవీ కాలం ముగియకపోయినా ఎన్నికలకు సిద్ధమయ్యారని తెలిపారు. మరే ఇతర రాజకీయ పార్టీలు చేయని సాహసం కేసీఆర్‌ చేశారని పొగడ్తలతో ముంచెత్తారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనే దమ్ములేకే టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తుల కోసం పాకులాడుతున్నాయని అసదుద్దీన్ అన్నారు.

టీడీపీ 4 ఏళ్లు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేసి, కేంద్ర మంత్రి పదవులను అనుభవించి.. ఎన్నికల ముందు మాత్రం కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. దళితులు, ముస్లింలపై దాడులు జరిగినప్పుడు చంద్రబాబు నోరుకూడా విప్పలేదని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి రాజధాని నిర్మించావో ముందు చూసుకొమ్మన్నారు. గట్టిగా వర్షం వస్తే మీ ఆఫీసులోకే(ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌) నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే టీడీపీ కథ ముగిసిందన్నారు.

Advertisement
Advertisement