బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు | Sakshi
Sakshi News home page

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు

Published Wed, Oct 29 2014 2:23 AM

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు

* బీసీ సంఘాల డిమాండ్   
* నవంబర్ 2 న బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
* రెండు రాష్ట్రాలు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
* పార్లమెంట్‌లో బిల్లుపెట్టాలన్న జాతీయ నేత ఆర్. కృష్ణయ్య
* 54 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు మూడు లక్షలేనా ?

 
సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని 12 బీసీ సంఘాలు, 22 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగుల సంఘాలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌చేశాయి. రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా దేశంలోని బీసీ ఉద్యోగులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరాయి. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ సంఘాల తరఫున బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చేనెల 24 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీని ఆయన డిమాండ్ చేశారు.   బీసీ ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఉద్యోగుల రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నట్టు కృష్ణయ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 54 లక్షల మందిదాకా ఉండగా, 3.62 లక్షల మంది మాత్రమే, అంటే 8 శాతమే బీసీ ఉద్యోగులు ఉండడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.
 
 నాచియప్పన్ కమిటీ సిఫారసులేవి ?
 జనాభాలో 56 శాతమున్న బీసీలకు 8 శాతం ఉద్యోగాలే దక్కాయని, పదోన్నతులలో రిజర్వేషన్లు లేక బీసీ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన అన్నిరంగాల్లో తగిన వాటా కల్పించాలని ఆయన డిమాండ్‌చేశారు. 2004 డిసెంబర్‌లో నాచియప్పన్ చైర్మన్‌గా ఏర్పడిన బీసీ పార్లమెంటరీకమిటీ చేసిన సిఫారసులు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు జాతీయస్థాయిలో బీసీ ఉద్యోగులంతా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో 74 మంత్రిత్వశాఖలున్నా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం శోచనీయమన్నారు.
 
 18 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు 950 కోట్లా ?
 దేశబడ్జెట్‌ను రూ.18 లక్షల కోట్లకు ప్రతిపాదిస్తూ, దానిలో బీసీల సంక్షేమానికి రూ.950 కోట్లు మాత్రమే కేటాయిస్తే అవి ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. బీసీ బిల్లును ప్రవేశపెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  అసెంబ్లీలలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారని, అయితే వాటిని ప్రధాని నరేంద్రమోదీకి అందజేసేందుకు అఖిలపక్ష బృందాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సాధన కోసం బీసీ ఉద్యోగులు సకలజనుల సమ్మె చేసినట్టుగా ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం అదే స్ఫూర్తితో పోరాడాలని  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ సమావేశంలో వివిధ బీసీ, ఉద్యోగ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, దుర్గయ్యగౌడ్, రాజేందర్, శారద, నగేశ్‌గౌడ్, బత్తిన రాజు , ముత్యం వెంకన్నగౌడ్, ఎస్. వెంకట నారాయణ, హెచ్.వెంకటస్వామి, జి. ఆనంద్, జి.మల్లేష్, సి.రామమూర్తి, హరనాథ్, హరికృష్ణ, ఆంజనేయులు,అజయ్‌కుమార్, జి.అచ్యుతరావు, కులిశెట్టి, శ్రీధర్, లక్ష్మీనారాయణ, పాండు, రమేశ్, రామారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement