బ్యూటీఫుల్ కోర్సు | Sakshi
Sakshi News home page

బ్యూటీఫుల్ కోర్సు

Published Thu, Sep 11 2014 1:06 AM

బ్యూటీఫుల్ కోర్సు

 భూదాన్‌పోచంపల్లి :నేడు యువతులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, మహిళలు ఎవరైనా సరే మేకప్ లేకుండా ఏ శుభకార్యానికి రావడంలేదంటే అతిశయోక్తి కాదు. తమ అందాలను మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి మేకప్ సర్వసాధారణమైంది. దీంతో మారుమూల గ్రామాల్లో సైతం బ్యూటీపార్లర్‌లు వెలుస్తున్నాయి. స్వయం ఉపాధి కల్పిస్తున్న బ్యూటీషియన్ కోర్సుకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్  ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్‌ఆర్టీఆర్‌ఐ) ‘కాస్మటాలజీ అండ్ బ్యూటీషియన్’ కోర్సులో నిరుద్యోగ విద్యార్థినులు, యువతులకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది.
 
 నేర్పించే అంశాలు...
 బ్యూటీషియన్ కోర్సులో ముఖ్యంగా ఫేసిషియల్, మేకప్, థ్రెడ్డింగ్, బ్లీచింగ్, మసాజ్, హెయిర్ డై, హెయిర్ కటింగ్, వాక్సింగ్, మెహందీ డిజైన్స్, పార్టీ అండ్ పెండ్లికుమార్తె మేకప్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం థియరీ క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కాగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ రోజుకు ఆ రోజు నోట్స్ రాయిస్తున్నారు. అందరికి అర్థమయ్యేలా సరళమైన విధానంలో బోధిస్తున్నారు.
 
 వివిధ ప్రాంతాల నుంచి..
 ఎస్‌ఆర్టీఆర్‌ఐ జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల సంస్థ సౌజన్యంతో నెల రోజుల కాలవ్యవధి గల ఈ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. టెన్త్ పాస్ లేదా ఫెయిల్ కనీస విద్యార్హత కల్గిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్ర స్తుతం మన జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన 25 మంది విద్యార్థినులకు మొదటి సారిగా ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్క డ హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు.
 
 స్వయం ఉపాధికి ఢోకాలేదు
 బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధికి ఢోకా లేదు. ఉన్న ఊర్లోనే తక్కువ పెట్టుబడితో సొంతంగా బ్యూటీపార్లర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఎస్‌ఆర్టీఆర్‌ఐ సంస్థ కూడా హైదరాబాద్ వంటి నగరాల్లో పేరుగాంచిన పెద్ద పెద్ద బ్యూటీపార్లర్‌లలో బ్యూటీషియన్‌గా ప్లేస్‌మెంట్ అవకాశం కల్పిం చేందుకు చర్యలు చేపట్టారు.
 
 జాబ్ కంటే ఈ కోర్సు బెటర్
 ఎస్సెస్సీ వరకు చదువుకున్నా. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యూటీషియన్ కోర్సును నేర్చుకొంటున్నా. నేర్చుకొన్న తరువాత ఇంట్లోనే స్వయం ఉపాధి పొందవచ్చు. ఎక్కడో జాబ్ చేసేకంటే ఈ కోర్సు నేర్చుకొంటే బెటర్. ఇక్కడ ఉచిత హాస్టల్ వసతి కూడా కల్పించారు.
 -పి.విజయలలిత, సూర్యాపేట
 
 ఇంట్లో ప్రాక్టిస్ చేస్తున్నా..
 ఇంటర్ పూర్తి చేసిన తరువాత మా ఇంట్లో చదువు మాన్పించారు. గతంలో ఇదే సంస్థలో ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ కోర్సు నేర్చుకొన్నాను. నాకు బ్యూటీషియన్ కోర్సు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ కోర్సును ఇష్టంతో నేర్చుకొంటున్నాను. ఇక్కడ నేర్చుకొన్న అంశాలను మా ఇంటి వద్ద ప్రాక్టిస్ చేస్తున్నా.
  - బిల్లబాలమణి, పోచంపల్లి
 
  ఉచితంగా నేర్పిస్తున్నాం
 మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నిమిస్మే సంస్థ సౌజన్యంతో మొదటిసారిగా బ్యూటీషియన్ కోర్సును ప్రవేశపెట్టి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఎస్సెస్సీ పాస్ లేదా ఫెయిల్ కనీస విద్యార్హతగా నిర్ణయించాం. 25 మందికి బ్యాచ్ చొప్పున శిక్షణ ఇస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే మా సంస్థ ముఖ్య ఉద్దేశం.
 -డాక్టర్ ఎన్.కిషోర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ డెరైక్టర్, ఎస్‌ఆర్టీఆర్‌ఐ
 
 మార్కెట్లో డిమాండ్ ఉంది
 బ్యూటీషియన్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సొం తంగా షాపు పెట్టుకొని స్వయం ఉపాధి పొందవచ్చు. కోర్సులో బేసిక్స్ నేర్పిస్తున్నాం. నేర్చుకున్నది మరిచిపోకుండా నోట్స్ కూడా రాయిస్తున్నాం. చాలా మంది ఈ కోర్సును నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.
 -గీత, ఇన్‌స్ట్రక్టర్
 

Advertisement
Advertisement