తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం | Sakshi
Sakshi News home page

తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం

Published Mon, Mar 17 2014 12:06 AM

తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం - Sakshi

ఐకమత్యానికి ప్రతీక సేవాలాల్ దీక్షలు
 41 రోజులపాటు దీక్షలు కొనసాగిస్తున్న బంజారాలు

 
 నార్నూర్, న్యూస్‌లైన్ :  ఆదిలాబాద్ జిల్లా గిరిజనులకు పెట్టింది పేరు.. అలాంటి గిరిజన తండాల్లో ప్రస్తుతం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బంజారాల ఆరాధ్యదైవం, కుల గురువు సంత్‌సేవాలాల్ మహరాజ్ దీక్షలు చేపట్టి బంజారాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
 
 మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభమైన ఈ దీక్షలు.. 41 రోజులకు ముగించనున్నారు. మరికొంత మంది సోమవారం నుంచి 21 రోజులపాటు దీక్షలు స్వీకరించనున్నారు. కాగా.. దీక్షలు శ్రీరామనవమి రోజున విరమించనున్నారు.
 
 700 మందికి పైనే..

 బంజారాల ఆరాధ్యాదైవం కుల గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ పేరిట మహాశివరాత్రి సందర్భంగా అదే రోజున ఈ దీక్షలను బంజారాలు చేపట్టారు. ఆదివారం హోలీ సందర్భంగా సేవాలాల్ భక్తులు దీక్ష భూమి వద్ద సంప్రదాయ పాటలు పాడుతూ, మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
 
 తండాల్లో ప్రతి ఒక్కరూ ఈ దీక్షలను తీసుకుంటారు. దీంతో తండాల్లో 41 రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. మండల కేంద్రంలోని కొత్తపల్లి (హెచ్) గ్రామంలో జాతీయ స్థాయిలో బంజారాల దీక్ష భూమి ఉంది. ఇక్కడికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది బంజారాలు వస్తారు.
 
  బంజార కులగురువు శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆధ్యాత్మిక మార్గంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని చాటి చెప్పారని పెద్దలు అంటుంటారు. 11 ఏళ్లుగా ఈ దీక్ష భూమి వద్ద బంజారాలు దీక్షలు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు.
 
 మండలంలోని కొత్తపల్లిలో 150 మంది, మల్లంగిలో 80 మంది, గంగాపూర్‌లో 100 మంది, నాగల్‌కొండలో 80 మంది, రాజన్‌గూడలో 20 మంది, మాగంలో 50 మంది, బీర్‌పూర్‌లో 40 మంది, తాడిహత్నూర్‌లో 60 మంది, ఉమ్రిలో 50 మంది తదితర గ్రామాల్లో దీక్షలు తీసుకున్నారు.
 
 సంప్రదాయం ప్రకారం..
 తరతరాల నుంచి ఈ సంప్రదాయం వస్తోం ది. ఈ తరం వాళ్లు కూడా సంప్రదాయానికి కట్టుబడి సేవాలాల్ దీక్షలను చేపట్టడం ఆనందంగా ఉంది. ప్రతి తండాల్లో సేవాలాల్ దీక్షలను చేపట్టడంతో అంత పవిత్రత నెలకొంది. ఇది ఎప్పటికీ కొనసాగించాలి.           - జాదవ్ రవితాబాయి
 
 ఇంటికొక్కరు చొప్పున దీక్షలో..

 41 రోజులపాటు తం డాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఇంటికొక్క రు చొప్పున సేవాలాల్ దీక్షలను చేపడుతారు. దీక్షలు చేపట్టం వలన అంతా మంచి జరుగుతుందని నమ్మకం. పురుషులతోపాటు మహిళలు సైతం ఈ దీక్షలను చేపడుతారు.          - యశ్వంత్‌రావ్
 
 

Advertisement
Advertisement