బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు | Sakshi
Sakshi News home page

బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

Published Mon, Aug 11 2014 2:07 AM

బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు - Sakshi

 హుజూర్‌నగర్ : సారా విక్రయించినా, బెల్టు షాపులు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు  హెచ్చరించారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న మద్యం విక్రయాలు ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయన్నారు.  అందుకే వాటిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధి లో సారా తయారీ కేంద్రాలపై, బెల్టు షాపులపై దాడులు నిర్వహిస్తూ  కేసులు నమోదు చేస్తున్న ట్లు తెలిపారు.  కొందరు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారని..
 
 ఇటీవల గుర్రంబోడు పోలీస్‌స్టేషన్ పరిధిలో 55 బైక్‌లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. గత ఏడాది మంజూరైన నిధులతో  దేవరకొండ, నల్లగొండలోని పోలీస్ క్వార్టర్‌‌సకు మరమ్మతులు చేయిం చామని, హుజూర్‌నగర్, గరిడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో గృహ సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వివరించారు. 2012 సంవత్సరం కంటే 2013 లో 1000 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. వాటిలో భూ తగాదాలు, భార్యా భర్తలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నాయన్నారు.
 
 జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలన్నీ వివాహేతర సంబంధాలు, భూతగాదాలకు సంబంధించినవని, ముఠాకక్షలు, రాజకీయ గొడవలు లేవని చెప్పారు. విధానపరమైన నిర్ణయాల వల్ల ఎస్‌ఐ, సీఐల బదిలీల ప్రక్రియలో జాప్యం జరిగిందని, వారం రోజు ల్లో బదిలీలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులకు ఇస్తున్న వారాంతపు సెలవుల వల్ల వారు మానసికంగా ప్రశాంతత పొంది విధులను సక్రమంగా నిర్వహించేందుకు దోహద పడు తున్నాయని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది ఎస్పీని శాలువాలు, పూల మాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె.మోహన్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వెంకటశివరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement